అసెంబ్లీలో హరీష్ వ్యాఖ్యలపై రగడ
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో బుధవారం సాయంత్రం మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై రగడ నెలకొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. రైతు సమస్యలపై రెండోరోజు కూడా సభలో చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా రాధామోహన్పై హరీష్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని, రైతు సమస్యలపై సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆయన అన్నారు. కేంద్రమంత్రి ఎలాంటి ఆరోపణలు చేయలేదని, హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు. ( రైతుల ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు, నపుంసకత్వం కారణమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ వ్యాఖ్యలు చేశారంటూ హరీష్ రావు పేర్కొన్నారు)
అంతకు ముందు రైతు సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతుల మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలన్నారు. రైతుల పట్ల ఏ రకమైన మర్యాద ఉందో చెప్పాలంటే తన దగ్గర చాలా సబ్జెక్ట్ ఉందని, మాట్లాడుకుందామంటే అది కూడా చెప్పుకుందామని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు సమాధానం చెబుతోంటే విపక్షాలు అడ్డుకున్నాయి.