రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు.
హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. తూర్పుగోదావరి జిల్లాకు బయటి వ్యక్తులు ఎవరూ రావొద్దని ఆంక్షలు ఎందుకు విధించారని ప్రశ్నించారు.
చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. రాచరిక పాలనను తలపిస్తున్నారంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని సభకు అనుమతి ఇచ్చామని సీఎం, ఇవ్వలేదని పోలీసులు అంటున్నారని.. ఎవరి మాటలు నమ్మాలని ఆయన నిలదీశారు. తెలంగాణలో 23 కులాలను బీసీ జాబితా నుంచి తొలిగిస్తే ఆర్. కృష్ణయ్య ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే కాపులకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.