
‘గ్రేటర్’ ఇరకాటం
జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే అరుదైన సన్నివేశం.. ఇదివరకెన్నడూ లేని విధంగా స్టాండింగ్ కమిటీ సమావేశంలో కనీస చర్చ జరగకుండా..
- బడ్జెట్.. బడ్జెట్..
- స్టాండింగ్ కమిటీలో చర్చకు కాంగ్రెస్ ‘నో’
- జీహెచ్‌ఎంసీలో విపత్కర పరిస్థితి
- సర్కారుకు కమిషనర్ లేఖ
- సర్వసభ్య భేటీకి సూచన
- నెలాఖరులోగా సమావేశం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే అరుదైన సన్నివేశం.. ఇదివరకెన్నడూ లేని విధంగా స్టాండింగ్ కమిటీ సమావేశంలో కనీస చర్చ జరగకుండా.. అక్కడ ఆమోదం పొందకుండానే కొత్త బడ్జెట్ (2014-15) సర్వసభ్య సమావేశం ముందుకు రానుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీహెచ్‌ఎంసీకి వర్తమానం అందింది. మేయర్ పీఠంపై ఎంఐఎం- కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం అమలుకు నోచకపోవడమే ఈ పరిణామాలకు కారణం.
ఒప్పందం మేరకు.. పాలకమండలికి చివరి ఏడాదైన ఈ సంవత్సరంలో కాంగ్రెస్ అభ్యర్థి మేయర్‌గా ఎన్నిక కావాలి. కానీ, మేయర్‌గా కొనసాగుతున్న మాజిద్‌హుస్సేన్ (ఎంఐఎం) రాజీనామా చేయకపోవడం, ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడంతో కినుక వహించిన కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యులు.. స్టాండింగ్ కమిటీ సమావేశంలో బడ్జెట్‌పై చర్చకు ‘నో’ అంటున్నారు. రెండేళ్ల క్రితం మాజిద్ మేయర్ కావడానికి ముందు ఎంఐఎం స్టాండింగ్ కమిటీ సభ్యు లు.. కాంగ్రెస్ మేయర్ కార్తీకరెడ్డి హయాంలోని బడ్జెట్‌కు తాము అంగీకరించేది లేదని, తమ పార్టీ మేయర్ వచ్చాకే ఆమోదిస్తామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ సైతం అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. తమ పార్టీ మేయర్ వచ్చే వరకు ఎంఐఎం మేయర్ ఆధ్వర్యంలో రూపొందించిన బడ్జెట్‌ను తాము ఆమోదించేది లేదని భీష్మించడంతో విపత్కర పరిస్థితి నెలకొంది.
కమిషనర్ లేఖతో..
బడ్జెట్ అంచనాలు, చర్చ, స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లో ఆమోదం పొందడం వంటివి నిర్ణీత వ్యవధిలో పూర్తయి మార్చి మొదటి వారంలోగా ప్రభుత్వానికి నివేదిక వెళ్లాలి. ఇప్పటి వరకు బడ్జెట్ అంచనాలు తప్ప ఆ తదుపరి కార్యక్రమాలు జరగలేదు. బడ్జెట్‌కు ప్రభుత్వ ఆమోదం లేనిదే వచ్చే ఏప్రిల్ నుంచి నిధులు వెచ్చించేందుకు వీల్లేదు. చివరకు ఉద్యోగులకు జీతభత్యాలూ అందని పరిస్థితి. దీంతో తాజా పరిణామాలను వివరిస్తూ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖ రాశారు.
ఏం చేయాలో సూచించాలని కోరారు. అందుకు స్పందించిన ప్రభుత్వం.. స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందకున్నా, సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాలని సూచించింది. ఈ మేరకు కమిషనర్‌కు లేఖ పంపినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. అంటే, బడ్జెట్ ఆమోదానికి ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తే సరిపోతుంది. నెలాఖరులోగా సమావేశం నిర్వహించాలన్నది జీహెచ్‌ఎంసీ వర్గాల యోచన.
సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందేనా?
ప్రభుత్వ సూచన మేరకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినా.. అక్కడైనా ఆమోదం పొందగ లదా? అన్నది ప్రశ్నార్థకమే!. ఎందుకంటే కోరం లేనిదే సర్వసభ్య సమావేశం సాధ్యం కాదు. కాంగ్రె స్ సభ్యులు కోరం లేకుండా చూడగలిగితే సమావేశమే జరగదు. కోరం అంటూ ఉండి సమావేశం జరిగితే చాలు.. ఎవరు వ్యతిరేకించినా ఆమోదం పొందినట్లు చూపే అవకాశముంది. గతంలో పలు అంశాల్లో అలా జరిగిన దాఖలాలున్నాయి.