
మళ్లీ బీపీఎస్?
సీఎం ఆదేశాల నేపథ్యంలో చర్చలు
నివాస గృహాలకు వర్తింపజేస్తారనే ఊహాగానాలు
సిటీబ్యూరో:నగరంలో మళ్లీ బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) అమలులోకిరానుందా?... ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఈవిషయమై చర్చలకు తావిచ్చాయి. ప్రభుత్వ భూముల్లో రక్షణ, భూ కబ్జాలపై చర్యల వంటి అంశాలపై గురువారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, లే ఔట్ రెగ్యులరైజేషన్‌లకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు. దీంతో బీపీఎస్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. అయితే బీపీఎస్ మళ్లీ సాధ్యం కాదని, భవిష్యత్‌లో అక్రమ నిర్మాణాలను తిరిగి క్రమబద్ధీకరించబోమంటూ అధికారులు హైకోర్టుకు లిఖితపూర్వకంగా గతంలో తెలియజేసిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో వెలసిన భవనాల క్రమబద్ధీకరణకు మాత్రం మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా సీఎం సూచించినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో పాత పద్ధతిలో కాకుండా కొద్దిపాటి మార్పుచేర్పులతో క్రమబద్ధీకరణకు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అమలులోకి వస్తే గురుకుల్ ట్రస్ట్‌లోని భవనాల క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది. వాణిజ్య భవనాలు, 18 మీటర్లకన్నా ఎత్తయిన బహుళ అంతస్తుల భవనాలకు కాకుండా సాధారణ నివాస గృహాలకు, తక్కువ విస్తీర్ణంలోని వాటికి వర్తించేలా కొత్త మార్గదర్శకాలతో తిరిగి బీపీఎస్ అమలు చేసే అవకాశాలు ఉండవచ్చునని టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
ఆదాయం కోసమే...
నగరంలో అనుమతి పొందిన దానికంటే అదనంగా... అసలు అనుమతి లేకుండా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గతంలో బీపీఎస్‌ను అమలు చేసిన సంగతి తెలిసిందే. 2007 డిసెంబర్ 31నసంబంధిత జీవో జారీ కాగా...అనేకసార్లు పొడిగిస్తూ 2010 వరకు అవకాశం కల్పించారు. ఆ పథకాన్ని వినియోగించుకునేందుకు మొత్తం 2.05 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిలో ప్రభుత్వ స్థలాలు, పార్కుల ప్రదేశాల్లో నిర్మించిన సుమారు 40,440 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 1,36,700 దరఖాస్తులు బీపీఎస్‌కు అనుగుణంగా ఉన్నందున ఆ భవనాలను క్రమబద్ధీకరించారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి దాదాపు రూ. 800 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు, గ్లోబల్‌సిటీగా తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు అవసరం. ఈ క్రమంలో నివాస గృహాలు... ప్రభుత్వ భూముల్లోని భవనాలకు బీపీఎస్ అమలు చేయడం ద్వారా కొంతలో కొంతైనా ఆదాయం సమకూర్చుకోవాలనేది సర్కారు మదిలోని ఆలోచనగా తెలుస్తోంది.