సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవా..? వాటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారా? ఇకపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు.. సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులు విద్యార్థులకు అండగా నిలవనున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బాలికలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలోని బాలికల హాస్టళ్లతోపాటు విద్యాశాఖ గురుకులాల్లోని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 706 హాస్టల్ వసతిగల విద్యా సంస్థల్లో ప్రత్యేక ఫోన్ సదుపాయాన్ని విద్యాశాఖ త్వరలోనే అందుబాటులోకి తేనుంది. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా విద్యా సంస్థల్లోని దాదాపు లక్ష మంది బాలికలకు భరోసా కల్పించనుంది.
వినడమే కాదు.. పరిష్కారంపైనా చర్యలు
రాష్ట్రంలోని 485 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), 192 మోడల్ స్కూళ్లు, మరో 29 గురుకుల పాఠశాలల్లో దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హాస్టళ్లలోనే దాదాపు లక్ష మంది బాలికలు ఉన్నారు. వారంతా తమ హాస్టళ్లు, స్కూళ్లలో ఎదుర్కొనే ఎలాంటి సమస్యలైనా సరే ఫిర్యాదు చేసే అవకాశాన్ని విద్యాశాఖ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులు చేసే ప్రతి ఫిర్యాదును రికార్డు చేసి అవి పరిష్కారమయ్యే వరకు నిరంతర సమీక్ష నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఆయా విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసే ఫోన్‌ను పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కాల్ సెంటర్‌కు అనుసంధానించనుంది.
విద్యార్థి హాస్టల్‌లోని ఫోన్ రిసీవర్ తీసుకోగానే ఆ ఫోన్ నేరుగా కాల్ సెంటర్‌కు మాత్రమే వెళ్లేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తోంది. కాల్ సెంటర్ సిబ్బంది కాల్ రిసీవ్ చేసుకోవడమే కాదు.. దాన్ని సంబంధిత సెక్షన్ అధికారి, సంబంధిత విభాగం ఉన్నతాధికారికి, జిల్లా డీఈవోకు, పాఠశాల ప్రిన్సిపాల్‌కు, పాఠశాల విద్యా డైరెక్టర్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నారు. మెసేజ్ రూపంలో వచ్చిన సమస్య పరిష్కారమైందా లేదా అన్నది అందులో అప్‌డేట్ చేస్తారు. ఆ తరువాత కాల్ సెంటర్ సిబ్బంది సమస్యల పరిష్కారంపై ర్యాండమ్‌గా విద్యార్థులకు ఫోన్ చేసి తెలుసుకొని నివేదికను డైరెక్టర్‌కు అందజేస్తారు. మరోవైపు విద్యార్థులు చేసే ఫిర్యాదులు రికార్డు అయ్యేలా కసరత్తు చేస్తున్నారు.
కాల్ సెంటర్, ఎమర్జెన్సీ నంబర్లకే ఫోన్..
పాఠశాలల్లో ఏర్పాటు చేసే ఫోన్ నుంచి కాల్ సెంటర్‌కు, పోలీసు, ఆసుపత్రి, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఫోన్ వెళ్లే సదుపాయం అందుబాటులో ఉంచేలా ప్రోగ్రాం రూపొందిస్తున్నారు. దానివల్ల విద్యార్థులు ఫోన్‌ను తమ సమస్యలను తెలియజేసేందుకు మాత్రమే ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాల్‌సెంటర్ సదుపాయాన్ని జూన్ నుంచి అమల్లోకి తెచ్చేలా చర్యలు వేగవంతం చేసింది. పాఠశాలల వేళలు మినహా మిగతా సమయాల్లో కాల్ సెంటర్ పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ సెంటర్ వేళలు ఉంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
స్కూళ్లకు కాల్ సెంటర్
Published Wed, Jan 24 2018 1:29 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment