పోస్టల్‌ శాఖకే కుచ్చుటోపీ...! | CBI case against the loss of Rs.7.6 crore of Postal department | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ శాఖకే కుచ్చుటోపీ...!

Published Thu, Aug 3 2017 3:36 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

పోస్టల్‌ శాఖకే కుచ్చుటోపీ...! - Sakshi

పోస్టల్‌ శాఖకే కుచ్చుటోపీ...!

- ముత్యాల కంపెనీతో ఉద్యోగుల ములాఖత్‌
- రూ.7.6 కోట్లు నష్టం చేకూర్చడంపై సీబీఐ కేసు 
 
సాక్షి, హైదరాబాద్‌: పోస్టల్‌ విభాగంలో పని చేస్తూ అదే శాఖకు కోట్లు నష్టం చేకూర్చిన అధికారులు, మరో ప్రైవేట్‌ కంపెనీ బాగోతం బయటపడింది. హుమాయూన్‌నగర్‌ పోస్టల్‌ ఉద్యోగులు సంస్థకు రూ.7.6 కోట్లు నష్టం తెచ్చిపెట్టారని, ప్రీషా పెరల్స్‌ కంపెనీతో ములాఖత్‌ అయి అక్రమాలకు పాల్పడ్డారని హైదరాబాద్‌ సిటీ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ హెచ్‌ఆర్‌ చంద్రశేఖర్‌ అచార్‌ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ పూర్తిచేసిన హైదరాబాద్‌ రేంజ్‌ సీబీఐ అధికారులు ముగ్గురు పోస్టల్‌ ఉద్యోగులు, ప్రీషా పెరల్స్‌ కంపెనీ, ఇద్దరు ప్రతినిధులపై కేసు నమోదు చేశారు. 
 
ఇదీ తతంగం..
ఆబిడ్స్‌కు చెందిన ప్రీషా పెరల్స్‌ వ్యాపారం నిమిత్తం పలు రాష్ట్రాలకు ముత్యాలను పోస్టల్‌ శాఖ ద్వారా పంపిస్తుంది. ఈ పార్సిళ్లను హుమాయూన్‌నగర్‌ పోస్ట్‌ఆఫీస్‌ నుంచి వినియోగదారులకు పంపడం, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెప్పించుకోవడం చేస్తోంది. అయితే కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ కుమార్‌ అగర్వాల్, డైరెక్టర్‌ శైలేష్‌ అగర్వాల్‌ హుమాయూన్‌ నగర్‌ సబ్‌ పోస్టాఫీస్‌లో పనిచేస్తున్న సబ్‌పోస్ట్‌మాస్టర్‌ ఎన్‌.కామేశ్వర్‌రావు, డిప్యూటీ సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ పద్మావతి, ఎస్‌.వెంకట స్వామితో కలసి పోస్టల్‌ శాఖకు నష్టం చేకూర్చేలా కుట్ర పన్నారు. ఇందులో భాగంగా సంబంధిత పెరల్స్‌ కంపెనీ పంపించే పార్సిళ్ల బరువును తక్కువ వెయిట్‌ చేయడం, అన్ని పార్సిళ్లకు ఒకే క్రమ సంఖ్యతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు సీబీఐ గుర్తించింది.

ఒక పార్సిల్‌కు సంబంధించిన వివరాలున్న ఒరిజినల్‌ కాపీతో పలు కలర్‌ జిరాక్స్‌ కాపీలు తీసి అన్నింటికీ ఒకే చార్జి కింద జమ చేసి అక్రమాలకు పాల్పడ్డట్టు సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇలా 2015 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 32.91 వేల పార్సిళ్లు పంపిస్తే, వాటిని లెక్కలో చూపించకుండా 14.66 వేల పార్సిళ్లు మాత్రమే చూపించి, వాటికి డబ్బులు వసూలు చేశారని, మిగతా 18.25 వేల పార్సిళ్లను లెక్కలోకి తీసుకోకుండా నష్టం చేకూర్చినట్టు ఆధారాలు సేకరించింది. ఇలా పెరల్స్‌ కంపెనీతో కలసి పోస్టల్‌ ఉద్యోగులు రూ.7.66 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంచేసింది. ఈ మేరకు పీసీయాక్ట్‌ 1988 కింద రెడ్‌విత్‌ 13(2), 13(1)(డి), ఐపీసీ రెడ్‌విత్‌ 120–బి, 468, 471, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీబీఐ హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ ఎఫ్‌ఐఆర్‌ కాపీలో స్పష్టంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement