
కూల్ ఛాలెంజ్
నెత్తి మీద నుంచి బకెట్‌తో నీళ్లు పోసుకోమంటే హ్యాపీ. అయితే ఆ నీళ్లు పొగలు కక్కేంత కూలింగ్‌తో ఉండాలని కండిషన్ పెడితే.. వామ్మో అంటాం కదా.. మరదే చాలెంజ్ అంటే! ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోందీ.. ఏఎల్‌ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్.
అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్(ఎఎల్‌ఎస్) అనేది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. దీనివల్ల మనిషి జీవచ్ఛవంలా మారతాడు. మన దేశంలో అంతగా కన్పించని ఈ వ్యాధి, కొన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోందట. ఇంతవరకు దీనికి కారణాలు కనుక్కోలేదు. అమెరికాకు చెందిన బేస్‌బాల్ ప్లేయర్ పెటె ఫ్రేట్స్ దీని బారిన పడ్డాడు. వ్యాధిపై అందరికీ అవగాహన కలిగించేందుకు కొత్త పంథా ఎన్నుకున్నాడు. గత నెలలో ఓ రోజు.. ఐస్‌కోల్డ్ వాటర్‌ను తల మీద నుంచి పోసుకున్నాడు(ఈ వ్యాధి కలిగించే బాధ నుంచి కాస్త ఉపశమనం ఇచ్చేందుకు ఐస్‌వాటర్ ట్రీట్‌మెంట్ కూడా ఒక మార్గమట).
ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టి.. ఇలా మీరు చేయగలరా? అంటూ చాలెంజ్ చేశాడు. దీనిని స్వీకరించినవారు 24గంటల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో 100 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కొంతమంది పార్టిసిపెంట్స్ పెద్దమనసుతో చాలెంజ్ పూర్తి చేసి కూడా డబ్బు చెల్లిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఈ చాలెంజ్‌ను నెట్‌స్క్రీన్‌కి ఎక్కించాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలను అందరినీ బకెట్ బాట పట్టించాయి. యూట్యూబ్‌లోని వారి వీడియోలకు అడ్వర్టయిజ్‌మెంట్స్ రూపంలో డబ్బులు రాసాగాయి.
ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఎఎల్‌ఎస్ ఫౌండేషన్ దీనిని ఒక పూర్తిస్థాయి ప్రాజెక్ట్‌గా చేపట్టింది. వ్యాధి నివారణ గురించిన పరిశోధనలకు నిధుల సమీకరణ కోసం మార్గంగా మార్చింది. ఈ చాలెంజ్ ఇప్పటికే దాదాపు 10 దేశాలను చుట్టేసింది. 15.6 మిలియన్ డాలర్లు రాబట్టింది. అయితే వ్యాధిపై పరిశోధనకు మరింత మొత్తం అవసరం అంటున్నారు ఫౌండేషన్ ప్రతినిధులు.
లాస్ ఏంజెలిస్ నుంచి సిటీ వరకు..
డేవిడ్ బెక్‌హామ్, సత్య నాదెళ్ల, బిల్‌గేట్స్.. క్రిస్టియానో రొనాల్డొ, జస్టిన్ టింబర్లేక్, జిమ్మీ ఫాలన్.. ఇలా చాలామంది సెలబ్రిటీలు ఐస్ బక్కెట్‌కి సై అన్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బిపాసా బసు, అభిషేక్ బచ్చన్, సోనాక్షి సిన్హా.. వంటివారంతా సై సై అన్నారు. తాజాగా ఈ చాలెంజ్ సిటీకి వచ్చింది. ఇక్కడి సెలిబ్రిటీలను కూడా కదిలించింది. ఈ ఎఎల్‌ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్‌ను నగరానికి తీసుకొచ్చిన తొలి టాలీవుడ్ సెలబ్రిటీ హన్సిక మోత్వాని.
తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యాన్స్‌ను కూడా చాలెంజ్‌కు నామినేట్ చేసింది. ఆమెతో పాటు సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, హీరో హర్షవర్ధన్ రాణే, నితిన్, ఉజ్వల్ భల్లా తదితర సెలబ్రిటీలు చాలెంజ్‌లు అందుకోవడమే ఆలస్యం.. బకెట్‌లతో ఐస్‌నీళ్లను నెత్తి మీద కుమ్మరించుకుంటూ యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నారు. హర్షవర్ధన్ రాణేను గుత్తా జ్వాల చాలెంజ్ చేస్తే.. రంగం ఫేమ్ కార్తీకను, రానా దగ్గుబాటి తదితరులను హర్ష చాలెంజ్ చేశాడు. సిటీకి జస్ట్ ఇప్పుడే ఎంటరైన ఈ బకెట్ మేనియా మరెంతమంది నెత్తి మీద నాట్యం చేస్తుందో చూడాలి.
..:: ఎస్.సత్యబాబు