
దేశంలో భద్రత కరువైంది: చాడ
హైదరాబాద్: భారతదేశంలో దళితులు, మైనారిటీలు, బడుగు బల హీన వర్గాలకు భద్రత లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. గాంధీ పుట్టిన గుజరాత్‌లోనే నలుగురు దళితులను చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం సంఘం అధ్యక్షుడు పల్లె నర్సింహా అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన చాడ మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో పారదర్శకత లోపించిందని, రాష్ట్రసాధనలో ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను చైతన్య పరచడానికి కళాకారులు ముందుండాలని పిలుపునిచ్చారు.
ఇప్టా జాతీయ ఉపాధ్యక్షుడు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని, అందుకు కళాకారులు సెప్టెం బర్ 7 నుంచి శిక్షణ శిబిరాల ద్వారా కళారూపాలను తయారు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఇప్టా సమితి సభ్యులు సి.హెచ్.జాకబ్, ప్రధాన కార్యదర్శి కె.లక్ష్మినారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఉప్పలయ్య, కొండల్‌రావు, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.