ప్రజాభీష్టానికే ముఖ్యమంత్రి ఓటు.. మరో మూడు జిల్లాలు! | CM kcr to vote people's demand on three new districts | Sakshi
Sakshi News home page

ప్రజాభీష్టానికే ముఖ్యమంత్రి ఓటు.. మరో మూడు జిల్లాలు!

Published Mon, Oct 3 2016 3:01 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

ప్రజాభీష్టానికే ముఖ్యమంత్రి ఓటు..  మరో మూడు జిల్లాలు! - Sakshi

ప్రజాభీష్టానికే ముఖ్యమంత్రి ఓటు.. మరో మూడు జిల్లాలు!

గద్వాల, జనగామ, సిరిసిల్ల జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సంకేతాలు
    కొత్త జిల్లాలపై రెండుమూడు చోట్లనే ఆందోళనలు
    వాటిని కూడా జిల్లాలుగా మారిస్తే తప్పేంటి?
    అక్కడి ప్రజలు నిజంగా కోరుకుంటే ఆ దిశగా కసరత్తు చేద్దాం
    మనం లేకున్నా జిల్లాలు, మండలాలు ఉంటాయి
    బాగా చేశారని ప్రజలంతా చెప్పుకోవాలి
    ఐదు జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్ నేతలతో భేటీ
   జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ
    నేడు వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం
 
సాక్షి, హైదరాబాద్: ‘‘కొత్త జిల్లాలపై రాష్ట్రంలో రెండు మూడుచోట్లనే ఆందోళనలు జరుగుతున్నాయి. వాటిని సైతం జిల్లాలుగా మారిస్తే తప్పేంటీ..? జిల్లాలు చిన్నచిన్నగా అవుతాయి. అక్కడి ప్రజలు నిజంగా కోరుకుంటే ఆ దిశగా కసరత్తు చేద్దాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దీంతో కొత్తగా గద్వాల, జనగామ, సిరిసిల్ల జిల్లాల ఏర్పాటుకు సైతం సానుకూలమే అన్న సంకేతాలిచ్చారు. గద్వాలను జిల్లాగా చేయాలంటూ అక్కడి ప్రజలు, నేతలు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే జనగామ, సిరిసిల్ల డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సీఎం తాజా వ్యాఖ్యలతో వీటిపై మళ్లీ ఆశలు చిగురించాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.
 
 టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.కేశవరావుతో పాటు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్‌పర్సన్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రజాభీష్టం మేరకు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై మార్పుచేర్పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. అవసరమనుకుంటే వాటి సంఖ్యను పెంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దసరా నుంచే కొత్త జిల్లాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు అన్నివిధాలా లాభదాయకంగా ఉండాలే తప్ప నష్టం కలిగించవద్దన్నారు. రాజకీయ కారణాలు, వ్యక్తిగత అభిప్రాయాలతో ఒత్తిడి తీసుకురావొద్దని పార్టీ నేతలకు స్పష్టంచేశారు.

ప్రజా ప్రతినిధులు ప్రజల సౌకర్యం, వారి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు. ‘‘కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ముసాయిదా విడుదల చేశాం. ప్రజల నుంచి సలహాలు, సూచనలు  అభ్యంతరాలు వచ్చాయి. వివిధ మార్గాల ద్వారా సమాచారం వచ్చింది. ప్రజలేం కోరుకుంటున్నారు. ప్రజలకేం అవసరముంది.. ముసాయిదాలో మార్పులు చేర్పులు అవసరమా? అనే విషయాలపై అధ్యయనం జరిగింది. ఎన్నో విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. అందుకే ముసాయిదాలో ప్రకటించిన జిల్లాలు, డివిజ న్లు, మండలాలే కాకుండా ప్రజలు కోరుకునే విధంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. అవసరమనుకుంటే వాటి సంఖ్యలో కూడా మార్పు ఉంటుంది’’ అని సీఎం తెలిపారు.
 
ప్రజా ప్రయోజనాలే ముఖ్యం
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ఆలోచన వెనుక ప్రజాప్రయోజనాలే ప్రధానమని సీఎం చెప్పారు. ‘‘గతంలో మండలాల ఏర్పాటుతో పాటు అనేక సందర్భాల్లో ప్రజలే కేంద్రంగా నిర్ణయం తీసుకోకపోవటంతో సమస్యలు తలెత్తాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. మనం అలా చేయకూడదు. మన ఆలోచన, ఆచరణ ప్రజలే కేంద్రంగా ఉండాలి. మనం లేకున్నా ప్రజలుంటారు. మండలాలుంటాయి.. జిల్లాలుంటాయి.. అవి గొప్పగా పని చేయాలి. ఇంత గొప్ప పని చేసి ప్రజల నుంచి చెడ్డపేరు తెచ్చుకోవద్దు.
 
ప్రజలంతా బాగా చేశారు అని చెప్పుకోవాలి. నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను పక్కనపెట్టాలి. రాజకీయ నాయకుల పెత్తనం కోసం కాకుండా ప్రజలేం కోరుతున్నారో వాటిని ప్రతిపాదించాలి. మార్పులు చేర్పులు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా జరగాలి. నాయకులు సరిగా ప్రతిపాదనలు చేయకున్నా ప్రభుత్వానికి ఇతరత్రా సమాచారం ఉంటుంది. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం. వివిధ మార్గాల ద్వారా సమాచారం సేకరించి అంతిమంగా ప్రజలే కేంద్రంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని పార్టీ నేతలకు ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి తేటతెల్లం చేశారు.
 
 నాలుగున్నరేళ్ల నాటి  కల
 ఉద్యమ సమయంలోనే నాలుగున్నరేళ్ల క్రితమే ప్రొఫెసర్ జయశంకర్, ఆర్.విద్యాసాగర్‌రావు తదితరుల సమక్షంలో తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరగాలనే చర్చ జరిగినట్లు సీఎం వివరించారు. ‘‘తెలంగాణ వచ్చిన వెంటనే చెరువుల పునరుద్ధరణ  చేపట్టడంతోపాటు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అత్యంత శాస్త్రీయంగా జరపాలని అనుకున్నాం. తెలంగాణలో పరిపాలనా విభాగాలు అశాస్త్రీయంగా ఉన్నాయి. ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యానికి వీలుగా పునర్‌వ్యవస్థీకరణ జరగాలని వివిధ రాష్ట్రాల్లో ఉన్న జనాభాను, జిల్లాలను పరిశీలించాం. తెలంగాణలోని జనాభా, విస్తీర్ణం ప్రకారం కచ్చితంగా జిల్లాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారమే టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని చేర్చాం’’ అని పేర్కొన్నారు.
 
మండలాల ప్రయోగం విజయవంతం
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మండలాల ఏర్పాటుపై కసరత్తు జరిగిందని, అప్పటి కమిటీలో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘మండలాల ఏర్పాటును అప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. పటేల్, పట్వారీల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ఎవరూ సుముఖంగా లేరు. కానీ ప్రజల సౌలభ్యానికి వీలుగా మండలాలు ఏర్పడ్డాయి. ఆ ప్రయోగం బ్రహ్మాండంగా విజయవంతమైంది. రిజర్వేషన్లు రావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు అవకాశాలు వచ్చాయి. రాజకీయంగా వారంతా పైకి వచ్చారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కూడా అదే తరహాలో మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రజలకు ఉపయోగపడుతుంది’’ అని సీఎం అన్నారు.
 
పేదరిక నిర్మూలనే లక్ష్యం
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరగాలని కోరుకోవడం వెనుక రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యం ఉన్నట్లు సీఎం చెప్పారు. ‘‘నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పనులకు వచ్చే మూడు నాలుగేళ్లలో భారీ పెట్టుబడులు అవసరం. ఇక రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే పెద్ద పని. చిన్న జిల్లాలుంటే ప్రతీ కుటుంబాన్ని పట్టించుకోవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ సులభం అవుతుంది. పథకాలన్నీ ప్రజలకు ఉపయోగపడేలా అమలు చేయొచ్చు. కలెక్టర్ల స్వయం పర్యవేక్షణ పెరుగుతుంది. పరిపాలనా కేంద్రాలు ప్రజలకు మరింత చేరువై ప్రభుత్వం ద్వారా అందాల్సిన సాయాన్ని అందుకోగలుగుతారు’’ అని సీఎం పేర్కొన్నారు?
 
మీ జిల్లాలో నాలుగో జిల్లాకు అవకాశముంది!
‘‘మీ జిల్లాలో నాలుగో జిల్లా ఏర్పాటుకు అవకాశముంది. ఆ దిశగా ప్రయత్నిద్దాం.. ఏ జిల్లాలో కలపాలనే విషయంలో వివాదాస్పదంగా మారిన మండలాలు, మరికొన్ని మండలాలు కలిపితే కొత్త జిల్లాకు ఛాన్స్ ఉంది. అలా కసరత్తు చేయాలని అధికారులతో మాట్లాడుతా’’ అని మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో సీఎం అన్నట్టు సమాచారం. గద్వాలను జిల్లా కేంద్రంగా మార్చాలని అక్కడి ప్రజలు, నేతలు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ జిల్లా ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురించాయి.
 
మరోవైపు నల్లగొండ జిల్లా ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా జనగామ కొత్త జిల్లా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. జనగామ జిల్లాగా మారితే ప్రతిపాదిత యాదాద్రి జిల్లాలో ఏ ప్రాంతాన్ని డివిజన్ కేంద్రంగా మార్చాలో ఆలోచించి చెప్పండి.. అని నల్లగొండ నేతలతో సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో ‘జనగామ జిల్లా అవుతుందా.. సార్.?’ అని నల్లగొండ నేతలు ఆరా తీశారు. అందుకు ‘‘దాని విషయం మీకెందుకు..? వరంగల్ జిల్లా నేతలు వచ్చినప్పుడు మాట్లాడుతారు..’’ అంటూ సీఎం నేరుగా చెప్పకుండా దాటవేసినట్లు సమాచారం. కాగా, సిరిసిల్ల, జనగామ జిల్లాల ఏర్పాటు అంశం సోమవారం కరీనంగర్, వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో భేటీ సందర్భంగా చర్చకు రానుంది.
 
దసరా నుంచే కొత్త జిల్లాలు
కొత్త జిల్లాలు దసరా నుంచే ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. తాత్కాలిక కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ‘‘శాశ్వత కార్యాలయాలకు స్థలాలు అన్వేషించాలి. ప్రతీ జిల్లా కేంద్రంలో అన్ని శాఖల కార్యాలయాలతో కూడిన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, కోర్టుల ప్రాంగణం ఉండాలి. వీటికోసం స్థలం అన్వేషించాలి. ఆ మూడింటికి ఒకేచోట స్థలం లేకపోతే.. వేర్వేరు చోట్ల జాగాలు చూడాలి. ప్రజలకు సౌకర్యంగా ఉండే వ్యూహాత్మక ప్రాంతాలను కార్యాలయాలకు ఎంపిక చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో స్థలాల ఎంపిక జరగాలి’’ అని ఆదేశించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement