కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక పరిణామాలు!
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివాదస్పద అంశాలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. గద్వాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా సానుకూలత వచ్చినట్టు సమాచారం. ఆయా జిల్లాల నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. ప్రజలు కోరుకునేవిధంగా జిల్లాలు ఏర్పాటు చేద్దామని, వ్యక్తిగత ప్రతిష్టలకు పోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది.
జనాభా ప్రతిపాదికన మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగో జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉందా అనే విషయంపై సీఎం ఆరా తీసినట్టు సమాచారం. జనగామ, సిరిసిల్ల జిల్లాల డిమాండ్ ను కూడా సానుకూలంగా పరిష్కరించేలా ఆయ జిల్లాల నాయకులతో ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల వారీగా కేసీఆర్ ఆదివారం సమీక్షలు నిర్వహించారు. నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు అనంతగిరిగా నామకరణం చేయాలని రంగారెడ్డి నేతలు సూచించారు. శంకరపల్లి, మొయినాబాద్, చేవెళ్లను శంషాబాద్ జిల్లాలో కలపాలని కోరారు. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నాయకులతో కేసీఆర్ సమావేశం కానున్నారు.