'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'
ఢిల్లీ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రైవేట్ మెంబర్ బిల్లు అడ్డుకోవడంపై కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కేవీపీ, రఘువీరా ఢిల్లీలో గురువారం మాట్లాడారు.
కేవీపీ మాట్లాడుతూ..ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్కు రాకుండా బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. యూపీఏ మిత్రపక్షాలన్నీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు తెలిపాయని చెప్పారు. ఇప్పుడు అడ్డుకున్న వచ్చే వర్షాకాల సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్నారు. ఆంధ్రుల ప్రయోజనాల కోసం శక్తి ఉన్నంత వరకు పోరాడుతామని కేవీపీ తెలిపారు.
ప్రత్యేక హోదా లేదని చెబుతున్నా కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ కొనసాగడం సిగ్గుచేటని దిగ్విజయ్ సింగ్ అన్నారు. శుక్రవారం ప్రైవేట్ బిల్లు ఓటింగ్కు రాకుండా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అడ్డుకున్నారన్నారు. ప్రత్యేక హోదాకు చట్టం అవసరం లేదు, కేబినేట్ నిర్ణయమే సరిపోతుందని దిగ్విజయ్ అన్నారు.
జైరాం రమేష్ మాట్లాడుతూ...ఏపీ, తెలంగాణలో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. సీట్ల సంఖ్య పెంపును ఫిరాయింపుల కోసం ఉపయోగించకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు సీట్ల పెంపుపైనే ఉన్నంతా ధ్యాస ప్రత్యేక హోదాపై లేదన్నారు.
టీడీపీ, బీజేపీ రాజద్రోహానికి, ప్రజాద్రోహానికి పాల్పడుతున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్కు రాకుండా వెంకయ్యనాయుడు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని విమర్శించారు.