గౌరవ పెద్దలే నష్టం చేస్తే ఎలా?
• సీఎల్పీ భేటీలో జానారెడ్డిని నిలదీసిన ఎమ్మెల్యేలు, నేతలు
• ఆ మాటలే తమపై ఆయుధాలవుతున్నాయని ఆవేదన
• ఆఫ్ ద రికార్డుగా చెప్పిన అంశాలను మీడియా వక్రీకరించిందన్న జానా
• భవిష్యత్తులో ఒకేమాటపై ఉందామని సూచన
• టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా పోరాడాలని భేటీలో నిర్ణయం
• సభను కనీసం 15 రోజులు నడపాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యవహారశైలి పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదనడం, తమ్మిడిహెట్టి ఎత్తు విషయంలో మహారాష్ట్రతో గతంలో ఒప్పందం జరగలేదనడం వంటి వ్యాఖ్యలు చేయడంపై సీఎల్పీ భేటీలో ఆయనను నిల దీశారు. శాసనసభ సమావేశాల్లో అనుసరిం చాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సోమవారం సీఎల్పీ సమావేశమైంది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీ ర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు.
సమావేశం ప్రారంభంలోనే..
సీనియర్ ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.సుధాకర్‌రెడ్డి, ఎం.రంగారెడ్డి తదితరులు సమావేశం మొదలుకావడంతోనే జానారెడ్డిని నిలదీశారు. ‘‘సీనియర్‌గా మీరంటే మా అందరికీ గౌరవమే. కష్టకాలంలో పార్టీని ఐక్యంగా నడిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. మహారాష్ట్రతో ఒప్పందం జరగలేదని, నయీమ్ ఎన్‌కౌంటర్ విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నామని మరిచిపోయినట్టుగా, అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడారు.
ప్రభుత్వంపై, టీఆర్‌ఎస్‌పై పోరాడుతున్నవారికి మీ తీరు వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. మీరు (జానారెడ్డి) మాట్లాడిన మాటలనే ఆయుధంగా చేసుకుని.. టీఆర్‌ఎస్ నేతలు మాపై దాడికి దిగుతున్నారు. పార్టీ నేతలే పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది..’’ అని పేర్కొన్నారు. దీనిపై జానారెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. నయీం వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలని పార్టీ నిర్ణయించినట్టుగా తనకు తెలియదని ఆయన చెప్పారు.
హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా సిట్‌పై అనుమానాలను వ్యక్తం చేయలేకపోయాననే తప్ప పార్టీకి నష్టం చేయాలనే ఉద్దేశం లేదన్నారు. ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన వాటిని, వక్రీకరించి మీడియాలో వచ్చిందని వివరించారు. భవిష్యత్తులో ముఖ్యమైన అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని, స్పష్టమైన వైఖరితో ఉందామని... అంతా ఒకేమాటపై ఉందామని జానారెడ్డి సూచించారు.
ప్రభుత్వంపై పోరాడదాం
నయీమ్ కేసులో వివిధ రాష్ట్రాలకు, రాజకీయ నేతలు, పెద్ద తలకాయల పాత్ర ఉండటం వల్లే సీబీఐ విచారణ కోరినట్టుగా సీనియర్ నేతలు భేటీలో వివరించారు. నయీమ్ కేసులో ఏదేదో రాస్తున్నారని, ఇందులో ప్రమేయమున్న రాజకీయ నేతలను మాత్రం అరెస్టుచేయడం లేదని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పువ్వాడ అజయ్‌కు 11 వేల గజాల ప్రభుత్వ భూమిని బహుమతిగా ఇచ్చారని పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలను సీఎల్పీ సమావేశంలో పెట్టారు. దీంతో ఈ అంశంపై ప్రభుత్వంతో చట్టపరంగా పోరాటం చేయాలని నేతలు నిర్ణయించారు. మహారాష్ట్రతో ఒప్పందం, నయీమ్ కేసు, టీఆర్‌ఎస్ అవినీతి వంటివాటిపై లోతుగా అధ్యయనం చేయాలని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ భేటీకి ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పద్మావతీరెడ్డి, దొంతి మాధవరెడ్డి గైర్హాజరయ్యారు.
కేసీఆర్‌పై సభాహక్కుల నోటీసు..
రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదంటూ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని సీఎల్పీ నిర్ణయించింది. మూడో విడత రుణమాఫీకి ఇచ్చిన తేదీ, ఎఫ్‌ఆర్‌బీఎం పెంపునకు కేం ద్రం అంగీకరిస్తే మొత్తంగా ఒకేసారి రుణమాఫీ చేస్తామని కేసీఆర్ సభలో ఇచ్చిన హామీకి సంబంధించిన వివరాలతో నోటీసు ఇవ్వనున్నారు. ఇక శాసనసభలో చర్చ సం దర్భంగా జీఎస్టీ బిల్లుపై జి.చిన్నారెడ్డి, జిల్లా ల విభజనపై మల్లు భట్టివిక్రమార్క, డి.కె.అరుణ, మహారాష్ట్రతో ఒప్పందం, ప్రాజెక్టుల రీడిజైన్‌పై టి.జీవన్‌రెడ్డి మాట్లాడాలని సమావేశంలో నిర్ణయించా రు. సభ్యులంతా సమయానికి హాజరుకావాలని సీనియర్ నేతలు సూచించారు. శాసనసభను కనీసం 15 రోజులపాటు నడపాలని కాంగ్రెస్ పార్టీ విప్‌లు సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి, ఆకుల లలిత డిమాండ్ చేశారు.