మా ఊరి లడ్డూకు ‘మారాజు’ లెవరో...
హైదరాబాద్: బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా...! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు.
చేతులు మారిన భారీ లడ్డూ తయారీ...
ఏటా బాలాపూర్ లడ్డూను పాతబస్తీ చార్మినార్ గుల్‌జల్ ఆగ్రా స్వీట్ హౌస్ నిర్వాహకులు 21 కిలోల బరువుతో కట్టిస్తారు. దశాబ్దాలుగా ఈ లడ్డూను తయారు చేయడంలో గుల్‌జల్ యాజమాన్యం ప్రత్యేక ఆసక్తిని చూపుతారు. అయితే ఈమారు ఈ అదృష్టాన్ని ఆంధ్రా ప్రాంత తాపేశ్వరం మిఠాయి తయారీదార్లు దక్కించుకున్నారు. నాణ్యత, సైజు విషయాల్లో ఎలాంటి తేడాలు లేనప్పటికీ ఖైరతాబాద్ వినాయకుని లడ్డూను తయారు చేసే తాపేశ్వరం వారే బాలాపూర్ లడ్డూను కూడా కట్టేందుకు అర్హతను దక్కించుకున్నారు.
1980లో మొదలై...
గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటిచెబుతూ 33 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. గతేడాది ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అండ్ సన్స్ రూ 9.26 లక్షలకు వేలంపాట పాడి లడ్డూను దక్కించుకున్నారు.
కుషాయిగూడ లడ్డూ రూ. 2.60 లక్షలు
కుషాయిగూడ: కుషాయిగూడ కూరగాయల మార్కెట్ ఎదురుగా గాంధీ మోమెరియల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని లడ్డూను కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి రూ 2.60 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది రూ: 1.70 లక్షలు పలికిన ఈ లడ్డు ఈ ఏడాది తొంబై వేలు అధికంగా ధర పలికింది.
బడంగ్‌పేట్ లడ్డూకు భలే క్రేజ్
దిల్‌సుఖ్‌నగర్: బడంగ్‌పేట గణపతి లడ్డూను దక్కించుకున్న వారికి అంతా శుభాలే జరుగుతుండటంతో ప్రతి ఏటా బడంగ్‌పేట లడ్డూకు క్రేజ్ పెరిగింది. 2014లో రూ, 4.05 లక్షలకు టీఆర్‌ఎస్ నాయకుడు కర్రె కృష్ణ దక్కించుకున్నాడు. రూ.1.50 లక్షలకు దక్కించుకున్న అవినాష్‌రెడ్డి
నిజాంపేట: నిజాంపేట బస్టాప్ వద్ద అచెట్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడి లడ్డూ ఈసారి రూ.1,50,001 పలికింది. నిజాంపేటకు చెందిన గడ్డం అవినాష్‌రెడ్డి రూ. 1,50,001లకు వేలంలో సొంతం చేసుకున్నాడు.
లడ్డూను దక్కించుకున్న వారి వివరాలు...
1994 కొలను మోహన్‌రెడ్డి రూ.450.
1995 కొలను మోహన్‌రెడ్డి రూ.4500
2010 శ్రీధర్‌బాబు రూ.5.30 లక్షలు
2011 కొలను ఫ్యామిలీ రూ.5.45 లక్షలు
2012 పన్నాల గోవర్థన్‌రెడ్డి రూ. 7.50లక్షలు
2013 టీకేఆర్ విద్యాసంస్థలు(తీగల కృష్ణారెడ్డి) మీర్‌పేట రూ. 9.26లక్షలు
2014 జైహింద్‌రెడ్డి బాలాపూర్ గ్రామం రూ,9.50 లక్షలు
ఇక మహాగణపతి చేతిలో 6వేల కిలోల లడ్డూ
ఖైరతాబాద్: ఐదు సంవత్సరాలుగా సురుచిఫుడ్స్ అధినేత మల్లిబాబు ఆధ్వర్యంలో ఖైరతాబాద్ మహాగణపతికి భారీ లడ్డూ సమర్పిస్తూ వస్తున్నారు. 2010లో 500కిలోల లడ్డూతో ప్రారంభమై 2011లో 2400కిలోలు, 2012లో 3500కిలోలు, 2013లో 4200కిలోలు, 2014లో5200కిలోలు సమర్పించారు. ఈ సారి 6000కిలోల మహాలడ్డూను సమర్పించారు. ఈ లడ్డూ 6నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ లడ్డూను దాదాపు లక్షా 50వేల మందికి ప్రసాదంగా అందజేయవచ్చని తాపేశ్వరం సురుచిఫుడ్‌స అధినేత మల్లిబాబు తెలిపారు.