
కలసికట్టు... ఆటకట్టు
వరుసగా పంజా విసురుతున్న స్నాచర్లు
ప్రజలంతా సంఘటితమైతేనే నేరాలకు చెక్
మనకు మనమే రక్షకులవుదాం
చైన్ స్నాచింగ్ అంటే పోలీసుల దృష్టిలో ఓ గొలుసు చోరీ కేసు... కొన్ని గ్రాముల బంగారం.
సామాన్యులకు మాత్రం అది
కొన్ని నెలల కష్టార్జితం... దానికి మించి మహిళలకు సెంటిమెంట్.
సిటీబ్యూరో: నగరంలో చైన్‌స్నాచర్లు విజృంభిస్తున్నారు. పగలూ రాత్రీ... అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా పంజా విసురుతున్నారు. వీరి కారణంగా మహిళలు పుస్తెల తాళ్లు కోల్పోవడమే కాదు.. గాయపడడం... ప్రాణాలు కోల్పోతున్న దుర్ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. స్నాచర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఇక మనమంతా ఒకటై ఉపక్రమిస్తేనే మనకు రక్ష అనే పరిస్థితి కనిపిస్తోంది. రండి... ఎవరికివారు... తమకు సాధ్యమైన బాధ్యత తీసుకుందాం. చైన్ స్నాచింగ్‌లకు చెక్ చెప్పి దొంగలకు సవాల్ విసురుదాం.
ఎవరికి వారుగా ముందుకు వస్తే...
ఉత్తరాదితో పాటు పొరుగు రాష్ట్రాల ముఠాలు నగరంపై కన్నేసి పంజా విసురుతున్నాయి. ఇలా వచ్చిన వారంతా లాడ్జిలు, హోటళ్లు, అద్దె ఇళ్లలో ఆశ్రయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సంస్థలతో పాటు ఇటు ఇళ్లను అద్దెకు ఇచ్చే, వర్కింగ్ మెన్స్ హాస్టల్స్ వారు సైతం కస్టమర్/టెనెంట్స్ వెరిఫికేషన్ పక్కాగా చేయాలి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో సహా వచ్చే వారి కదలికలు గమనిస్తుండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
స్థానిక స్నాచర్లలో 90 శాతం కొత్తవారే. విద్యార్థులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు ఈజీ మనీ కోసం ఈ బాట పడుతున్నారు. వీరిని కట్టడి చేయాలంటే కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఉపక్రమించాల్సిందే. ఓ కన్నేసి ఉంచడం ద్వారా హఠాత్తుగా జీవన సరళి మారిన వ్యక్తులు, స్థోమతకు మించి విలాసాలకు ఖర్చు చేస్తున్న వారిని గుర్తించాలి. నేర్పుగా కూపీలాగి సంబంధీకులతో పాటు పోలీసులనూ అప్రమత్తం చేయాలి.
కాలనీ సంక్షేమ సంఘాలు, యూత్ ఆర్గనైజేషన్స్‌కు నగరంలో కొదవలేదు. ఖాళీ సమయాల్లో వీలున్నంత వరకు బృందాలుగా ఏర్పడి ప్రాంతాల వారీగా గస్తీ కాయాలి. ముఖ్యంగా జన సంచారం తక్కువగా ఉండే ప్రధాన రహదారులతో పాటు నిర్జన ప్రదేశాల పైనా కన్నేసి ఉంచాలి. ద్విచక్ర వాహనాలు... ప్రధానంగా హైస్పీడ్ వెహికిల్స్‌పై తిరిగే కొత్త వ్యక్తులను ఆపి వివరాలు ఆరా తీయాలి. అనుమానం వస్తే అక్కడే ఆపి పోలీసులను పిలవాలి.
ఉదయం, సాయంత్ర వేళల్లో వాకింగ్ చేసేవారు ఎంద రో. దీని కోసం అనేక చోట్ల టీమ్స్ సైతం ఏర్పడ్డాయి. ఇలా నడిచే సమయాన్నీ స్నాచర్ల కట్టడికి వినియోగించవచ్చు. పార్కులు, నిర్ణీత ప్రాంతాల్లో వాకింగ్ చేయడం కంటే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ రహదారులు, స్నాచర్ల ప్రభావం ఉన్న చోట్లను ఎంపిక చేసుకోవాలి. నడుస్తూనే చుట్ట పక్కల ప్రాంతాలు, మనుషులపై కన్నేసి ఉంచితే... వారి కదలికలను గమనిస్తూ ఆరోగ్యం, భద్రత రెండూ పొందే వీలుంటుంది. స్థానికంగా ఉన్న మైత్రి/శాంతి సంఘాల సభ్యులనూ భాగస్వాములను చేసుకోవచ్చు.
కాలనీవాసులు ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే స్నాచర్లను కట్టడి చేయవచ్చు. మహిళలు ఎక్కువగా వెళ్లే ప్రాంతాలతో పాటు దేవాలయాలు ఉన్న చోట్లా విడతలు, వంతుల వారీగా బృందాలుగా ఏర్పడి గస్తీ కాసుకోవాలి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే స్నాచర్లను కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది.
జాగ్రత్తగా ఉండాల్సిందే...
స్నాచర్లకు టార్గెట్‌గా మారుతున్న వారిలో వివాహితులే ఎక్కువ. దీనికి వారి మెడల్లో ఉండే బంగారం పరిమాణం ఒక కారణమైతే... వస్త్రధారణ మరో కారణం. ఇటీవల కాలంలో యువతులంతా స్కార్ఫ్‌లు వాడటం అలవాటుగా చేసుకున్నారు. దీంతో వారి మెడలోని గొలుసులు ఇతరులకు కనిపించేందుకు.. వాటిని లాగేందుకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే వివాహితలు సైతం బయటకు వచ్చినప్పుడు మెడ చుట్టూ చున్నీ చుట్టుకోవడం... స్కార్ఫ్ వాడటం చేయాలి. కనీసం కొంగునైనా మెడ చుట్టూ కప్పుకోవాలి.
చిరునామాలు చెప్పాలని... ఇళ్లు అద్దెకు తీసుకుంటామని, మంచినీళ్లు కావాలని ఇళ్ల దగ్గరకు, ఇంట్లోకి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. అపరిచితులకు సాధ్యమైనంత దూరంలో ఉండి మాట్లాడండి. ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం స్పందించి చుట్ట పక్కల వారినీ అప్రమత్తం చేసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో ఈ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి.
ద్విచక్ర వాహనంపై ఓ చోట స్నాచింగ్ చేసిన చోరులు వరుస పెట్టి నలుగురైదుగురిని బాధితులుగా మార్చి వెళ్తున్నారు. దీన్ని అరికట్టాలంటే స్నాచింగ్ బారినపడిన బాధితులు ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంలో ఆలస్యం చేయకూడదు.జాప్యం వల్ల ‘గోల్డెన్ మినిట్స్’ వృదా అవుతుండటంతో స్నాచర్లు భద్రంగా గమ్యస్థానాలకు చేరిపోతున్నారు. స్నాచింగ్ జరిగిన వెంటనే తక్షణం ఈ సమాచారాన్ని ‘100’కు ఫోన్ చేసి చెప్పాలి. దొంగలు, వాహనం గుర్తులతో పాటు వారు వె ళ్లిన దిశనూ చెప్పాలి. అప్పుడే మరొకరు బాధితులుగా మారకుండా కాపాడడంతో పాటు స్నాచర్లను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నిర్జన ప్రదేశాలు... జన సమ్మర్థం తక్కువగా ఉన్న చోట్ల ఒంటరిగా సంచరించవద్దు. వాహనాలపై వెళ్లేటప్పుడు వెనుక వస్తున్న వారినీ గమనించండి.
ఆ స్ఫూర్తిని మళ్లీ పొందలేమా..?
సైబరాబాద్‌లో 2005కు ముందు పరిస్థితులు మరీ దారుణం. ఎప్పుడు... ఏ ముఠా విరుచుకు పడుతుందో చెప్పలేని స్థితి. దారుణంగా చంపేసి... అందిన కాడికి దోచుకుపోయే గ్యాంగులెన్నో. వీరికి చెక్ చెప్పడానికి అప్పట్లో కాలనీ సంక్షేమ సంఘాలు నడుం బిగించాయి. వంతుల వారీగా కర్రలు, ఈలలతో గస్తీ కాసేలా చేసి ఫలితాలు సాధిం చా యి. ఇప్పుడు చైన్‌స్నాచర్లను కట్టడి చేయడానికి మరోసారి ఒక్కటి కాలేమా..? సంక్షేమ సంఘాలతో పాటు ప్రతి ఒక్కరం మనవంతు బాధ్యత తీసుకోలేమా? హైదరాబాద్, సైబరాబాద్ కమిషరేట్లలో కలిపి క్షేత్ర స్థాయి పోలీసుల సంఖ్య 15 వేలు దాటదు. అయితే ఏం? నగర జనాభా కోటికి అటూఇటుగా ఉంది. పిల్లలు, వృద్ధులు, మహిళలను వదిలేసినా మన సంఖ్య 20 లక్షలకు తగ్గదు. అంతా కలిస్తే ఊహించలేనంత బలం మనది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చుట్టూ ఉన్న పది మీటర్ల పరిధిలోని వ్యక్తులపై కన్నేసి ఉంచితే చాలు. ఒక్క స్నాచర్లేంటి... ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరగాళ్లూ తోకముడవాల్సిందే.