గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పని చేస్తున్న సుమారు 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందకపోతుండటంపై సర్కారు సీరియస్ అయింది.
పంచాయతీరాజ్ శాఖను వివరణ కోరిన సీఎస్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పని చేస్తున్న సుమారు 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందకపోతుండటంపై సర్కారు సీరియస్ అయింది. ‘సెర్ప్ ఉద్యోగులకు వేతన వేదన’ శీర్షికన ఈనెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సీఎస్ రాజీవ్‌శర్మ స్పందించారు. వేలాది మంది ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందకపోతుండటం, ఆగస్టు 1 నుంచి వేతన పెంపు అమలు కాకపోవడం తదితర అంశాలపై వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఈనెల 20న నోటీసు జారీ చేశారు.
అయితే పంచాయతీరాజ్ శాఖ నుంచి సమాచారం అందకపోవడంపై సీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ అదేశాల మేరకు జాయింట్ సెక్రటరీ శ్రీధర్ ..సెర్ప్ అధికారులకు 21న మెమో జారీ చేశారు. అయినప్పటికీ శుక్రవారం వరకు సెర్ప్ అధికారుల నుంచి తనకు సమాచారం అందలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సెర్ప్ ఇంచార్జి సీఈవో అనితా రాంచంద్రన్, సీఎస్ నోటీసుకు వివరణ పంపించామని ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులకు వేతన పెంపు విషయమై కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, పరిష్కరించి సాధ్యమైనంత త్వరగా వేతనాలు అందజేస్తామని పేర్కొన్నారు.