
సారీ డాడీ..
- ఇంటర్ విద్యార్థిని విషాదం
- నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య
చైతన్యపురి, న్యూస్‌లైన్: ‘నేను ఏ తప్పు చేయకున్నా బంధువులు, ఫ్రెండ్స్ అనుమానించార’ంటూ మనస్తాపం చెందిన ఇంటర్ విద్యార్థిని స్యూసైడ్ నోట్‌రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సరూర్‌నగర్ సీఐ నర్సింహరావు కథనం ప్రకారం.. నల్లగొండజిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లికి చెందిన వెంకటయ్య లారీ డ్రైవర్. కర్మన్‌ఘాట్ మాధవనగర్‌లో భార్య, కూతురు, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. కూతురు శ్రీలత (16) చైతన్యపురిలో శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ మొదటి ఏడాది చదువుతోంది.
గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీలత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లి.. భర్తకు, పోలీసులకు తెలిపింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు. ఘటనా స్థలి నుంచి ఒక నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తన స్నేహితులు తనను దూరంగా ఉంచుతున్నందుకు బాధపడుతున్నానని, కుటుంబసభ్యులు కూడా అనుమానిస్తున్నారని అందుకే ఈ నిర్ణ యం తీసుకుంటున్నట్లు అందులో రాసి ఉంది. ‘సారీ డాడీ.. నీ కోరిక తీర్చలేకపోయాను.. మమ్మీ.. నీకిక కష్టాలుండవు...నన్ను మర్చిపోకండి.. అమ్మమ్మ కోసం బతకాలని ఉంది... కానీ కుదరట్లేదు. కరిగిపోతే క్యాండిల్ విలువ.. గడిచిపోతే కాలం విలువ... దూరమైతే కానీ నా విలువ తెలియవు’ అని పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.