కేటీఆర్‌కు నైతికత లేదు: శ్రవణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు నైతికత లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేటీఆర్ పాల్పడుతున్న ఇసుక దందాలపై ప్రశ్నించినందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని నేరెళ్ల దళితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌కు ఏ మాత్రం నైతికత ఉన్నా నేరెళ్ల దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని, బాధ్యులైన ఎస్పీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్టీలో చేనేత రంగంపై కేంద్రం పన్ను భారం మోపుతుంటే.. కేటీఆర్ చేనేత సంబురాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జీఎస్టీతో తెలంగాణకు రూ. 3 వేల కోట్లు నష్టం అని మంత్రి ఈటల చెబుతుంటే.. రూ. 3 వేల కోట్లు లాభం అని ముఖ్యమంత్రి చెబుతున్నారన్నారు. జీఎస్టీపై రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమన్నారు. జీఎస్టీలో ప్రభుత్వ పథకాలపై కేంద్రం 12 శాతం పన్ను విధిస్తే.. కేసీఆర్ ఇప్పుడు మేల్కొని దాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి కాకుండా మంత్రి కేటీఆర్ ఎందుకు పాల్గొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకే కేటీఆర్ ఇలా చేస్తున్నారని విమర్శించారు.