డీసెట్... అప్‌సెట్..!
కోర్సుపై విద్యార్థులకు తగ్గుతున్న ఆసక్తి
- మూడు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ
- ఇప్పటివరకు వచ్చినవి 18,550 దరఖాస్తులే
- 2015లో నిర్వహించిన పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు 1.11 లక్షల మంది..
సాక్షి, హైదరాబాద్: డీఈడీ కోర్సుపై విద్యార్థుల ఆసక్తి తగ్గుతోంది. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రి యలో జాప్యం జరుగుతుండడం.. దానికితోడు డీసెట్ నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటం తదితర కారణాల వల్ల క్రమంగా ఈ కోర్సుకు ఆదరణ తగ్గుతోంది. గతేడాది డీసెట్ నిర్వహించకపోగా.. తాజాగా సెట్ నిర్వహణకు సర్కారు ఉపక్రమించింది. మరో మూడు రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుండగా ఇప్పటివరకు కేవలం 18,550 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. 2015 సంవత్సరంలో నిర్వహించిన డీసెట్ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,11,413 మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం దరఖాస్తు చేసినవారు అందులో 20 శాతం మంది కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 197 డీఈడీ కాలేజీలు ఉండగా.. అందులో 9,440 సీట్లు ఉన్నాయి. ఆ లెక్కన సీటుకు ఇద్దరు చొప్పున తాజాగా దరఖాస్తు చేసుకున్నారు.
ఐదేళ్లుగా నియామకాల్లేవ్..!
ప్రాథమిక విద్యా బోధనలో కీలకమైన ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) ఉద్యోగాలకు డీఈడీ చేసిన అభ్యర్థులే అర్హులని తేల్చడంతో తొలుత ఇబ్బడిముబ్బడిగా డీఈడీ కోర్సు చేశారు. టెట్ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించారు. కాని ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. దానికి తోడు పాఠశాలల హేతుబద్ధీకరణపై విస్తృత ప్రచారం జరుగుతుండ టంతో క్రమంగా ఈ కోర్సుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలే జరగలేదు. ఫలితంగా డీఈడీ చేసే అభ్యర్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతూ వస్తోంది. మరో మూడు రోజుల్లో దరఖాస్తు ముగియనుంది. అయినప్పటికీ వీటి సంఖ్య అధిక స్థాయిలో మాత్రం పెరిగే అవకాశం లేదని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.