నగదులో.. నల్లధనం లేనట్లేనా..! | Deposits of over Rs 70 crore in Telangana | Sakshi
Sakshi News home page

నగదులో.. నల్లధనం లేనట్లేనా..!

Published Fri, Dec 30 2016 3:10 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

నగదులో.. నల్లధనం లేనట్లేనా..! - Sakshi

నగదులో.. నల్లధనం లేనట్లేనా..!

తెలంగాణలో రూ.70 వేల కోట్లు దాటిన డిపాజిట్లు
డిసెంబర్‌ పదో తేదీ నాటికే రూ.60 వేల కోట్లకు చేరిన డిపాజిట్లు
ఆ తర్వాత వివరాల వెల్లడిపై గోప్యత పాటిస్తున్న ఆర్బీఐ
రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చింది రూ.22 వేల కోట్లే    


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నల్లధనం లేదని తేటతెల్లమైనట్లేనా...! పెద్ద నోట్ల రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న నగదుకు క్లీన్ చిట్‌ ఇచ్చినట్లయింది. కేంద్రం నిర్ణయించిన గడువుకు ముందే రాష్ట్రంలో చెలామణిలో ఉన్న 500, 1000 నోట్లన్నీ తిరిగి బ్యాంకు ఖాతాల్లోకి చేరుకోవటం గమనార్హం. దీంతో నగదు రూపంలో నల్లధనం నిల్వలేవీ రాష్ట్రంలో లేవని లెక్క తేలినట్లయింది. కేంద్రం, ఆర్బీఐ అంచనాల ప్రకారం  తెలంగాణలో రూ.70 వేల కోట్ల విలువైన పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నాయి. డిసెంబరు 30వ తేదీకి ఒక రోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో జమైన పెద్ద నోట్ల విలువ రూ.70 వేల కోట్లకు చేరినట్లు అంచనాలున్నాయి. ఈనెల 10వ తేదీ నాటికి ప్రజలు జమ చేసిన డబ్బు,  మార్చుకున్న పాత నోట్ల విలువ రూ.60 వేల కోట్లు. స్వయంగా ఆర్బీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన సమాచారం ఇది.

ఆ తర్వాత బ్యాంకులకు వచ్చిన డబ్బు వివరాలను ఆర్‌బీఐ అధికారికంగా వెల్లడించకుండా గోప్యత పాటించింది. కానీ గడిచిన 19 రోజుల్లో రమారమి రూ.10 వేల కోట్ల డబ్బు జమ అయినట్లు బ్యాంకు అధికారులు, ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లకు సరిపడే సంఖ్యలో నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి చేరాయి. బడాబాబులు, నల్ల కుబేరులు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తమ దగ్గర నిల్వ ఉన్న నగదును బ్యాంకుల్లో వేసుకునేందుకు వెనుకంజ వేస్తారని, దీంతో రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల నుంచి రూ.65 వేల కోట్ల మధ్యలోనే పెద్ద నోట్లు బ్యాంకులకు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఆర్‌బీఐ సైతం అదే అంచనాలను వ్యక్తం చేసింది. కానీ పెద్ద నోట్లు అంచనాకు మించి జమ కావటంతో తాజా పరిణామాలను అధికారులు మరో కోణంలో విశ్లేషించుకుంటున్నారు. తెలంగాణలో పన్ను పరిధిలోకి వచ్చే డబ్బు గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు.

బడా బాబులు సైతం తమ దగ్గరున్న నగదును బ్యాంకుల్లో జమ చేశారని, దీంతో ఇప్పటివరకు పన్ను ఎగవేతకు గురైన డబ్బు సైతం బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిందని లెక్కలేస్తున్నారు. బ్యాంకుల్లో చేరిన డబ్బు పక్కాగా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొందరు నల్ల కుబేరులు సర్కారుకు చిక్కకుండా నల్లధనంతో భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేసిన అభియోగాలున్నాయి. కేంద్రం నిర్ణయం వెలువడిన ఒక రోజు వ్యవధిలోనే వందలాది కోట్ల బంగారం వ్యాపారం జరిగిందని ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు గుర్తించటం ఈ పరిణామాలను ధ్రువపరుస్తోంది.

యాభై రోజులుగా ఉత్కంఠ
నల్లధనానికి అడ్డుకట్ట వేసే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసింది. తొలుత బ్యాంకులకు వెళ్లి రూ.4000 వరకు నగదు మార్పిడికి అవకాశం ఇచ్చింది. పెట్రోలు బంకులు,  ప్రభుత్వ ఫీజులు, బకాయిలు, పన్నుల చెల్లింపులకు పాత నోట్లు వినియోగించే వెసులుబాటు కల్పించింది. దీంతో పెట్రోలు బంకుల వద్ద, కరెంటు బిల్లులు, కార్పొరేషన్  మున్సిపల్‌ బిల్లుల బకాయిలన్నీ చెల్లించేందుకు నవంబర్‌ నెలాఖరు వరకు జనం ఎగబడ్డారు.  క్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ సడలింపులన్నీ ఎత్తివేసింది. డిసెంబర్‌ 30 వరకు ప్రజలు బ్యాంకు ఖాతాల్లో పాత నోట్లు జమ చేయాలని గడువు విధించింది. గడువు సమీపించటంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పాత నోట్లు బ్యాంకులకు చేరాయి.. ఎన్ని కొత్త నోట్లు రాష్ట్రానికి పంపిణీ అయ్యాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.


ఇప్పటికీ తీరని నోట్ల కొరత
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చి 50 రోజులు గడచినా రాష్ట్రంలో నగదు కొరత తీరలేదు. ప్రజలు జమ చేసిన డబ్బుతో పోలిస్తే.. రాష్ట్రానికి వచ్చిన కొత్త నోట్లు ఇప్పటికీ మూడో వంతు కంటే తక్కువగా ఉన్నాయి. గురువారం నాటికి రాష్ట్రానికి రూ.22 వేల కోట్ల కొత్త నోట్లు పంపిణీ అయ్యాయి. మరోవైపు ఖాతాదారులు బ్యాంకుల్లో వేసిన పాత నోట్లకు సరిపడే డబ్బును తిరిగి విత్‌డ్రా చేసుకోలేక పోతున్నారు. నగదు ఉపసంహరణపై కేంద్రం విధించిన ఆంక్షలు కొనసాగుతుండటంతో సామాన్యు లు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 80 శాతం ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులున్నాయి.

ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల నుంచి వారానికి రూ.24 వేలు మించకుండా నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశమున్నప్పటికీ.. అది ఆచరణలో అమలు కావటం లేదు. నగదు లేదనే కారణంతో బ్యాంకులు ఖాతాదారులను తిప్పి పంపిస్తున్నాయి. తమ దగ్గరున్న కొద్దిపాటి నగదును సర్దుబాటు చేసేందుకు రూ.6000కు మించి ఇవ్వలేమని తమ వినియోగదారులకు కరాఖండిగా చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement