
నగరంలో ఇక డ్రంకర్స్ కు ప్రత్యేక డ్రైవర్లు
సైబరాబాద్‌లో ‘డిజిగ్నేటెడ్ డ్రైవర్ ఆఫ్ డే’శ్రీకారం చుట్టిన పోలీసులు.
♦ సైబరాబాద్‌లో ‘డిజిగ్నేటెడ్ డ్రైవర్ ఆఫ్ డే’
♦ శ్రీకారం చుట్టిన పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మద్యం తాగి వాహనాలు నడపడాన్ని నిరోధించేందుకు సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందు లో భాగంగానే విదేశాల్లో అమలవుతున్న ‘డిజిగ్నేటెడ్ డ్రైవర్ ఆఫ్ డే’ విధానానికి శ్రీకారం చుట్టారు.
బార్/పబ్ యజమానుల ‘సేఫ్టీ’ పాఠాలు...
డిజిగ్నేటెడ్ డ్రైవర్ ఆఫ్ డే ఈ పదం అమెరికాలో ఫేమస్. ఎందుకంటే అక్కడ ఎవరైనా నైట్ ఔట్ పార్టీకి వెళ్లే వాళ్లు ఆ గ్రూప్‌లో ఉన్న ఒక వ్యక్తి ఆ రోజు మందు కొట్టకూడదు. ఆ విధంగా వారికి వారే నిర్ణయించుకుం టారు. ఆ రోజు రాత్రి బాగా తాగి ఎంజాయ్ చేస్తారు. వారిలో మద్యం తాగని వ్యక్తి వారిని సేఫ్‌గా ఎవరి ఇంటికి వారిని చేర్చుతాడు. మన నగరంలో కూడా వీకెండ్ వస్తే స్నేహితులంతా గ్రూప్‌గా కలిసి మద్యం తాగడానికి ఓ వాహనంలో వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు వారిలో ఒక వ్యక్తిని మిగిలిన వారు డిజిగ్నేటేడ్ డ్రైవర్‌గా ఎంచుకుంటే మంచిది.
ఒకవేళ దీని గురించి తెలవకుండా మందుకొట్టేందుకు వచ్చిన వారికి డిజిగ్నేటేడ్ డ్రైవర్ విధానాన్ని బార్/పబ్ యజమానులు వివరిస్తారు. ఎవరో ఒకరు మందు తీసుకోకుండా ఉంటే సేఫ్‌గా ఇంటికి చేరుకోవచ్చని చెబుతారు. అలా ఆ గ్రూప్‌లోని ఓ వ్యక్తిని డిజిగ్నేటెడ్ డ్రైవర్‌గా ఎంచుకొని ఆ వ్యక్తి చేతికి ఓ ప్రత్యేకమైన బ్యాండ్ వేస్తారు బార్/పబ్ సిబ్బంది. ఇది ఉన్న వ్యక్తికి ఆ పబ్, బార్‌లో సాధారణ పానీయాలు మినహా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సరఫరా చేయరు. అయితే ఆ గ్రూప్‌లో అందరూ మందు తీసుకుంటే మాత్రం క్యాబ్‌ను అద్దెకు తీసుకోమని చెబుతారు.
లేదంటే తమ డ్రైవర్ ఎవరైనా ఉంటే వెంటపెట్టుకొని రమ్మని సూచిస్తారు. దీనిపై ఇప్పటికే బార్/పబ్ యజమానులకు సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ పోలీసులు సూచించారు. కాలేజీల్లో యువతకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగిస్తూనే...డిజిగ్నేటెడ్ డ్రైవర్ విధానాన్ని చెబుతున్నారు. ఇప్పటికే నెలరోజుల్లో దాదాపు 30 కాలేజీల్లో ట్రాఫిక్ సేఫ్టీపై అవగాహన కలిగించారు.