విద్యుత్ ప్లాంట్లకు వడ్డీలో రాయితీ
జెన్‌కోకు రూ.400 కోట్లు ఆదా
- 1 శాతం వడ్డీ తగ్గించేందుకు రుణ సంస్థల అంగీకారం
- జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణానికి ఒక శాతం వడ్డీ తగ్గించి రుణ సౌకర్యం కల్పించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) సంస్థలు ముందుకొచ్చాయని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ సం స్థలు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి 10.5 శాతానికి పైగా వడ్డీగా విధిస్తారని, కానీ తెలంగాణ జెన్‌కోకు మాత్రం 9.65 శాతం వడ్డీకే రూ.40 వేల కోట్ల రుణం అందిస్తున్నాయన్నారు. దీంతో రూ.400 కోట్లు పొదుపు అవుతాయన్నారు. విద్యుత్ సంస్థ లు పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు, ప్లాంట్ల నిర్మాణంలో పారదర్శకత తదితర ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేట్లు తగ్గించాయన్నారు.
రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చడానికి జెన్‌కో ఆధ్వర్యంలో 6వేల మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ప్లాంట్లను నెల కొల్పుతున్నామన్నారు. యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటు 5వ యూనిట్ నిర్మా ణానికి రూ.4.009 కోట్ల రుణం విషయం లో పీఎఫ్‌సీ ప్రతినిధులతో విద్యుత్ సౌధలో సీఎండీ ప్రభాకర్‌రావు, అధికా రులు సోమవారం సమావేశమయ్యారు. 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణానికి రూ.25 వేల కోట్లు, 1,080 మెగావాట్ల మణుగూరు ప్లాంటుకు రూ.7,600 కోట్లు, 800 మెగావాట్ల కొత్తగూడెం 7వ యూనిట్‌కు రూ.6,800 కోట్లు, 120 మెగావాట్ల పులిచింతల ప్లాంటుకు రూ.680 కోట్లు అంచనా వ్యయంగా ఉందన్నారు.
పవన విద్యుదుత్పత్తికి అవకాశం
రాష్ట్రంలో 4,500 మెగావాట్ల పవన విద్యు దుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అవకాశముందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అధ్యయనంలో వెల్లడైం దని ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పవన విద్యుదుత్పత్తికి అనుకూల ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆమోదిస్తే త్వరలో పవన విద్యుత్ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ నెల 25వ తేదీనే వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రభాకర్‌రావు వెల్లడించారు.