
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి వారం కూడా కాలేదు. అప్పుడే, తన కార్యాలయం కేటాయింపుపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. వ్యవసాయ కమిషనరేట్‌లోని మీటింగ్ హాలును గుత్తా చాంబర్‌గా కేటాయించారు.
అయితే కమిషనరేట్ ప్రాంగణంలో గుత్తాకు చాంబర్ కేటాయించవద్దంటూ కొందరు ఉద్యోగులు విన్నవించగా అది తాత్కాలికమేనంటూ ఉన్నతాధికారులు సర్దిచెప్పినట్లు తెలిసింది. ఆ శాఖ మంత్రితో అత్యంత సన్నిహితంగా ఉండే ఉద్యోగులే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. నెల క్రితమే అధికారులు గుత్తా కోసం వ్యవసాయ కమిషనరేట్‌లో ఒక చాంబర్ సిద్ధం చేశారు. అందుకోసం రూ.40 లక్షలు ఖర్చు చేశారు.
అంతా సిద్ధం చేశాక గుత్తా సోదరుడు, కుమారుడు వచ్చి ఆ కార్యాలయాన్ని పరిశీలించి వాస్తు ప్రకారం లేదంటూ విముఖత చూపారు. కమిషనర్ జగన్‌మోహన్ విధులు నిర్వహిస్తున్న చాంబర్‌ను కేటాయించాలని గుత్తా అనుచరులు ఒత్తిడి తెచ్చారు. దీనిపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడంతో గుత్తా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరకు మీటింగ్ హాలునే చాంబర్‌గా సిద్ధం చేశారు.
ఆధిపత్యంపై పరస్పర వ్యాఖ్యలు
వ్యవసాయాధికారులపై గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితి సభ్యులు ఆధిపత్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఆదిలోనే గుత్తా చాంబర్ విషయమూ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో గుత్తా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రి పోచారం పలు వ్యాఖ్యలు చేశారు. ‘వ్యవసాయాధికారుల మనసు నొప్పించకుండా సమితి సభ్యులు సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఎవరిపైనా పెత్తనం చేయడానికి మనం ఇక్కడకు రాలేదు.
అధికారులపై ఆధిపత్యం వద్దు. ఇప్పటివరకు తామంతా కలసిమెలసి కుటుంబసభ్యుల్లా పనిచేస్తున్నాం’అంటూ పోచారం చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అదే సందర్భంలో గుత్తా మాట్లాడుతూ ‘వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో సమితి సభ్యులు సమన్వయంతో పనిచేయాలి. ఎవరిపైనా ఆధిపత్యం చేయకూడదు’అని పేర్కొనడం గమనార్హం.‘కమిషనరేట్‌లో గుత్తా కార్యాలయం ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందని, ప్రొటోకాల్‌తోనే సరిపోతుంది’అని కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment