
బీజేపీకి ప్రచారం చేయను
బీజేపీ టికెట్లు అమ్ముకున్నారు
దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే లోథ ధ్వజం
అబిడ్స్ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కుమ్మక్కై బీజేపీని నాశనం చేస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ అన్నారు. గ్రేటర్‌లో బీజేపీ టికెట్‌లను బిల్డర్లు, భూకబ్జాదారులకు అమ్ముకున్నారని ఆరోపిం చారు. గురువారం తన కార్యాలయం లో విలేకరులతో మాట్లాడుతూ... గ్రేటర్‌లో బీజేపీ ఓడిపోయేలా దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి టికెట్ల పంపకం చేశారన్నారు. దీనిపై తాను కొన్ని నెలలుగా ముందుగానే హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలనే ఆకాంక్షతో హిందుత్వవాదులకు టికెట్లు ఇవ్వాలని కోరినా ఒక్క హిందుత్వవాదికి కూడా టికెట్ కేటాయించలేదన్నారు.
బీజేపీ ఓడడం ఖాయం: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధుల్లో అత్యధికులు ఓడిపోవడం ఖాయమని, ఇందుకు కారణం బండారు దత్తాత్రే య, కిషన్‌రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి వారు దందాలు చేసుకుంటున్నారని, వారిద్దరి కారణంగా గ్రేటర్‌లో బీజేపీ తీరని నష్టం జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తాను బీజేపీ తరపున ప్రచారం చేయనని స్పష్టం చేశారు. టీడీపీతో కలిసి బీజేపీ అభ్యర్ధులు బలంగా ఉంటే దాదాపు 80-100 సీట్లు కైవసం చేసుకోవచ్చునని. అయితే టీఆర్‌ఎస్‌కు మేయర్‌పీఠాన్ని అప్పగించేందుకే సరైన అభ్యర్ధులను ఎంపిక చేయలేదన్నారు.