ఆధారాలు లేని అభ్యంతరాలు చెల్లవు!
- నల్సార్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాలకిష్టారెడ్డి
- సాదాబైనామా-క్రమబద్ధీకరణపై నల్సార్/ల్యాండెసా పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: భూమిని కొనుగోలు చేసిన రైతు పేరిట ఉన్న సాదాబైనామాలను క్రమబద్ధీకరించే విషయమై హక్కుదారులు/వారసులు తగిన ఆధారాల్లేకుండా అభ్యంతరపెట్టినా అది చెల్లదని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వి.బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. సాదాబైనామా-క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలతో నల్సార్ వర్సిటీ, ల్యాండెసా/ఆర్‌డీఐ సంయుక్తంగా రూపొందించిన పుస్తకాన్ని శుక్రవారం ఇక్కడ ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ల్యాండెసా డెరైక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్) చట్టం మేరకు తెల్లకాగితంతోపాటు రిజిస్ట్రేషన్ కాని ఎటువంటి పత్రాలపై రాసుకున్న ఒప్పందాలనైనా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు ఉందన్నారు.
సాదాబైనామా ప్రక్రియపై రెవెన్యూ యంత్రాంగానికి, లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించడమే ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందులో దరఖాస్తు ప్రక్రియ నుంచి టైటిల్ డీడ్ పొందేవరకు అనుసరించాల్సిన పద్ధతులు, చెక్‌లిస్టులు, హైకోర్టు తీర్పులు, దరఖాస్తు నమూనా.. తదితర అంశాలను పొందుపరిచామన్నారు. భూమిని కొన్న వ్యక్తులు మరణించినా చట్టబద్ధమైన వారసులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. యాజమాన్యహక్కులపై న్యాయస్థానాల్లో వివాదాలున్నట్లయితే సదరు దరఖాస్తులను అంగీకరించరని చెప్పారు.
క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇలా..
► గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామా ద్వారా జూన్ 2, 2014లోపు కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని సాగులో ఉన్న చిన్న, సన్నకారు రైతులు క్రమబద్ధీకరణ కోసం ఫారం 10లో వివరాలను నింపి మీసేవా ద్వారా తహసీల్దారుకు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలి.
► రైతులు దరఖాస్తుతోపాటు సమర్పించిన సాదాబైనామాలోని వివరాలను తహసీల్దారు సరిచూసి, పహాణీ, ఆర్‌వోఆర్ 1బి, ఈసీ(ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్)లను పరిశీలించాలి. విచారణ ని మిత్తం తేదీలను తెలుపుతూ సంబంధిత వ్యక్తులకు నోటీసు జా రీ చేయాలి. విచారణ రోజున దరఖాస్తులోని అంశాల ప్రకారం దరఖాస్తుదారు సాగులో ఉన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి.
► క్షేత్ర పరిశీలనలో రెవెన్యూ సిబ్బంది దృష్టికి వచ్చిన అంశాలన్నింటినీ తహసీల్దారు పరిశీలించి వాటిని వెబ్‌సైట్లో పొందుపరచాలి. వాస్తవికతను నిర్ధారించి ఫారం 13బి జారీ చేయాలి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరించినట్లైతే కారణాలను తెలుపుతూ ఎండార్స్‌మెంట్ ఇవ్వాలి.
► సక్రమంగా ఉన్న దరఖాస్తులకు సంబంధించి ఫారం 13సి ద్వారా సబ్ రిజిస్ట్రార్‌కు వివరాలను తెలియజేయాలి. తహసీల్దారు తెలిపిన వివరాల మేరకు సబ్‌రిజిస్ట్రార్ సంబంధిత రిజిస్టర్‌లో వాటిని నమోదు చేస్తారు. అనంతరం ఫారం 13బి మేరకు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్‌ను తహసీల్దారు అందజేస్తారు.
తరచూ ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు జవాబులిలా..
► తెల్లకాగితం, స్టాంపు పేపరు, నోటరీ చేయించిన పత్రాలను కూడా సాదాబైనామాగానే పరిగణిస్తారు.
► సీసీఎల్‌ఏ ఉత్తర్వుల ప్రకారం సాదాబైనామా ఉంటేనే క్రమబద్ధీకరణ చేస్తారు. తెల్లకాగితంపై కొని గతంలో పట్టా కోసం దరఖాస్త్తు చేసుకున్నవారూ క్రమబద్ధీకరణకు తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చు.
► దరఖాస్తుతోపాటు ఆధార్, సాదాబైనామా, పహాణీ, సాగు చేసుకుం టున్నట్లుగా రుజువుల నకళ్లను జతపరచాలి. బ్యాంకు రుణం పొం దినా, కరెంట్ కనెక్షన్, బోర్‌వెల్.. తదితర ఆధారాలు సమర్పించాలి.
► సాధారణంగా సాదాబైనామా ద్వారా భూమిని అమ్మిన వ్యక్తులు లేదా వారి వారసులు అనుమతి అవసరమే. ఒకవేళ వారు అభ్యంతరం చెప్పినట్లయితే తగిన ఆధారాలతో నిరూపించాలి.
► పహాణీలో నమోదు కాకున్నా, భూమి కొనుగోలుదారుడి అనుభవంలో ఉండి సాగు చేసుకుంటున్నట్లయితే తహ సీల్దారు గ్రామంలో విచారించి పెద్దల వాంగ్మూలంతో క్రమబద్ధీకరణ చేయవచ్చు.
► అసైన్‌మెంట్ భూములను అమ్మడం, కొనుగోలు చేయడం నేరం. ఆయా భూములపై ఎటువంటి లావాదేవీలు చెల్లవు. కొన్నవారికి జైలుశిక్షతో పాటు రూ.2 వేల వరకు జరిమానా కూడా విధిస్తారు.
► సాదాబైనామాలపై ఐదెకరాలకు మించి భూమిని కొన్నట్లయితే ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ వర్తించదు. ఐదెకరాల లోపు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్‌డ్యూటీలను ప్రభుత్వం మినహాయించింది.
► అన్నదమ్ముల పంపకాల పత్రాన్ని సాదాబైనామాగా పరిగణించరు.