
'అసెంబ్లీ అయ్యేదాకా సిటీ వీడద్దు'
⇒ వెళ్లాలంటే మంత్రులు, సీఎస్ అనుమతి తీసుకోవాలి
⇒ అన్ని శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమావేశాలు ముగిసే వరకు అధికారులు ఎవరూ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరైనా హైదరాబాద్ వీడి వెళ్లాలంటే సంబంధిత మంతులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగే అంశాలపై సంబంధిత మంత్రులకు ఎప్పటికప్పుడు వివరాలు అందజేయాలని ఆయా శాఖల అధికారులకు సీఎస్ సూచించారు. ఇప్పటికే సభ్యులు అడిగిన పెండింగ్ ప్రశ్నలన్నింటికీ తక్షణం సమాధానాలను అసెంబ్లీకి సమర్పించాలని ఆదేశించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాల పైనా తగిన సమాధానాలను అసెంబ్లీకి పంపించేందుకు ప్రతి శాఖలో జవాబుదారీ గల అధికారిని నియమించాలని సూచించారు. అలాగే గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఇచ్చిన హామీలకు సంబంధించి లిఖిత పూర్వక సమాధానాలను అసెంబ్లీకి పంపించాలని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సూచించారు.