జీడిమెట్ల(హైదరాబాద్): తోటి విద్యార్థినిని ప్రేమించి మోసం చేసిన యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎస్సై లింగ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ మల్లిఖార్జున్‌రెడ్డి నగర్‌కు చెందిన శ్రీనివాస్ నాయుడు ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్‌కు క్లాస్‌మేట్ అమూల్యతో పరిచయం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, రెండు నెలల క్రితం అమూల్య పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తనకు ఇష్టం లేదంటూ శ్రీనివాస్‌నాయుడు మొహం చాటేశాడు. అమూల్యతో మాట్లాడటం కలవడం మానివేశాడు.
దీంతో మనస్తాపానికి గురైన అమూల్య గత నెల 28వ తేదీన చింతల్‌లోని శ్రీనివాస్ నాయుడు ఇంటికి వచ్చి నిద్ర మాత్రలు మింగింది. అపస్మారక స్ధితికి చేరుకున్న అమూల్యను శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అమూల్య తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు 420, 378, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.