
కేఎస్ రామారావుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు కేఎస్ రామారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కేఎస్ రామారావుతో పాటు కార్యదర్శికి, మరో నలుగురికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన గురువారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కేఎస్ రామారావును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 41 నిబంధన పాటించాలని, కేఎస్ రామారావుకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కాగా ఈ నెల 24న ఫిలింనగర్‌లోని ఫిలింనగర్ కన్వెన్షన్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ)లో పోర్టికో కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గంపైన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.