
నాలుగు కోడ్‌లుగా కార్మిక చట్టాలు
* కేంద్రమంత్రి దత్తాత్రేయ వెల్లడి
పటాన్‌చెరు/రామచంద్రాపురం: దేశంలోని వివిధ రకాల కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు పీఎఫ్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1928 నుంచి 2008 వర కు మొత్తం 44 కార్మిక చట్టాలు ఉన్నాయని తెలిపారు.
వాటన్నింటినీ ఇండస్ట్రియల్ వేజ్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, వర్కింగ్ కండిషన్స్ అండ్ సేఫ్టీ కోడ్‌లుగా విభజించి కొత్త చట్టాలను అమల్లోకి తె స్తామని చెప్పారు. ఈ నెల 20న జాతీయ స్థాయిలో లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే ఈ సదస్సులో కార్మిక సంఘాలు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్రాల అధికారులు పాల్గొంటారని తెలిపారు. కనీస వేతనాలు అమలు చేసే అంశం రాష్ట్రాలదేనన్నారు.
పీఎఫ్ ఖాతాదారులకు ఇళ్లు
మొత్తం 4.3 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారని, వారందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని దత్తాత్రేయ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ పాల్గొన్నారు.
లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్
కార్మిక చట్టాలు సక్రమంగా అమలయ్యేలా లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అవసరమని దానిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని దత్తాత్రేయ అన్నారు. మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సుమారు 7,832 పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై కూడా ఆలోచిస్తామన్నారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, ఐడీఏ బొల్లారంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను మెరుగు పర్చేలా ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డును ప్రవేశపెడుతుందన్నారు. ఈఎస్‌ఐ జాయింట్ డెరైక్టర్ పద్మజా, రీజినల్ డెరైక్టర్ రాయ్ పాల్గొన్నారు.