నష్టపోయిన రైతులను ఆదుకోండి
- నకిలీ విత్తన కంపెనీలపై కఠిన చర్యలు చేపట్టాలి
- గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట నష్టంపై పూర్తి వివరాలను సేకరించి రైతులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల వ్యవహారంలో వ్యవసాయ అధికారులు, విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని... రుణమాఫీలో మిగిలిపోయిన మూడు, నాలుగో విడతల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు 8 సీట్లే వస్తాయని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్ని సీట్లు గెలిచింది, ఎంత మందిని చేర్చుకుం దో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విపక్ష ఎమ్మెల్యేలు ఎక్కడైనా, ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు బయటపడతాయన్నారు.
సంక్షేమంపై ఇంత నిర్లక్ష్యమా?
పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తా రు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేదలకు ఉచిత వైద్యం కోసం వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని.. ఆయన హయాం లో ఆస్పత్రులకు నిధులు విడుదల కాకుండా సేవలు నిలిచిపోయిన సందర్భాలు ఉత్పన్నం కాలేదని గుర్తుచేశారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు లక్షల కోట్లు కేటాయిస్తూ... ఆరోగ్యశ్రీకి రూ.500 కోట్ల బకాయిలను, 14 లక్షల మంది బడుగు విద్యార్థులకు రూ.3వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎందుకు చెల్లించడం లేదన్నారు.
వైఎస్సార్ 36లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారని, గ్రామసభల్లో ఇళ్లు లేని వారు చేతులు ఎత్తితే వారికి ఇల్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, వాటి ఊసే మరిచిందన్నారు. సీపీఎం చేపడుతున్న పాదయాత్రను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ పాదయాత్రకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇక తమ పార్టీ కొత్త జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలను దీపావళి కల్లా ప్రకటిస్తామని చెప్పారు.