
మోగింది రణభేరి
► ఫిబ్రవరి 2న ‘గ్రేటర్’ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
► డివిజన్ల రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ
► కొద్దిసేపటికే షెడ్యూల్ ప్రకటన.. అమల్లోకి కోడ్
► 12న ఎన్నికల ప్రకటన..
► 17 వరకు నామినేషన్ల స్వీకరణ
► 18న పరిశీలన.. 21 వరకు ఉపసంహరణ గడువు
► అనంతరం తుది జాబితా, ఎన్నికల గుర్తుల ప్రకటన
► ఫిబ్రవరి 2న పోలింగ్.. 5న ఓట్ల లెక్కింపు, ఫలితాలు
► 74 లక్షల మంది ఓటర్లు.. 7,757 పోలింగ్ కేంద్రాలు
► ఎన్నికల విధులకు 46,545 మంది అధికారులు, సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. ప్రభుత్వ వ్యూహాలు, హైకోర్టు జోక్యం, హడావుడి మధ్య శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అంతకు కేవలం గంటన్నర ముందే (మధ్యాహ్నం మూడున్నర సమయంలో) డివిజన్ల రిజర్వేషన్లను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఈ ఎన్నికలకు 12వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 2న ఎన్నికలు జరుగుతాయి, 5వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.
అమల్లోకి ఎన్నికల కోడ్
జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రత్యేకాధికారి బి.జనార్దన్‌రెడ్డితో కలసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికలను పూర్తిచేయాలని, ఒక్కరోజు సైతం వృధా చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో తక్షణమే షెడ్యూల్‌ను విడుదల చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఆ మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లుగా ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసిన మూడు రోజుల వ్యవధిలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం... జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తమ డివిజన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు 12వ తేదీన ప్రకటన జారీ చేస్తారు. అదే రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ స్వీకరణ జరుగుతుంది. భోగి, సంక్రాంతి సెలవులైన 14, 15వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణకు విరామం ఇవ్వనున్నారు. 18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుపుతారు. అనంతరం 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఈ గడువు ముగిసిన వెంటనే (3 గంటల తర్వాత) అభ్యర్థుల తుది జాబితాను, వారి ఎన్నికల గుర్తులను ప్రకటిస్తారు. వచ్చే నెల 2న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ ఎక్కడైనా అవసరమైతే 4వ తేదీన రీపోలింగ్ జరుపుతారు. 5న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. వెనువెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.
సుమారు 74 లక్షల మంది ఓటర్లు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 70,67,934 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వారికి అదనంగా ఓటరు నమోదు కోసం వచ్చిన 4,42,712 దరఖాస్తుల్లో అర్హత గల 3,46,999 దరఖాస్తులను ఎంపిక చేశారు. అంటే మొత్తంగా ఓటర్ల సంఖ్య 74 లక్షలు దాటిపోనుంది. గ్రేటర్ ఓటర్ల మూడో అనుబంధ జాబితాలో ఈ కొత్త ఓటర్ల వివరాలను ప్రచురిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటేసేందుకూ అవకాశం కల్పిస్తున్నారు. చివరిసారిగా 2009లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం 43 శాతం పోలింగ్ నమోదైంది. దాంతో పోలింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ తమ పోలింగ్ కేంద్రాన్ని సులభంగా కనుక్కునే విధంగా ఎన్నికల జాబితాను రూపొందించామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి సైతం ఓటర్లు తమ ఓటు, పోలింగ్ కేంద్రం వివరాల గల ‘ఓటరు రసీదు’ ప్రతిని పొందవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు 7,757 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని... స్థానికంగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని యాగ్జిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటును ఎన్నికల యంత్రాంగం పరిశీలిస్తోందని తెలిపారు. ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలోనే పోలింగ్ స్టేషన్ ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లలో చైతన్యం నింపేందుకు భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈవీఎంలతో ఎన్నికలు..
ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను వినియోగించనున్నారు. వీటిపై అభ్యర్థుల పేర్లు, చిహ్నాలు ఉంటాయి. అభ్యర్థుల ఫోటోలను ముద్రించడం లేదు. ఒకే చోట 64 మంది వరకూ పోటీలో ఉన్నా.. ఈవీఎంలను వినియోగించవచ్చు. అభ్యర్థులు అంతకు మించితే పేపర్ బ్యాలెట్ వినియోగించాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులెవరూ నచ్చకపోతే ‘నోటా (పైవారెవరూ కాదు)’ ఆప్షన్‌ను ఎంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారమే సూచనలు అందాయని, ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో 46,745 మంది అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. అందులో 775 మంది పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు 7,757, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 7,787, అదనపు ప్రిసైడింగ్ అధికారులు 23,271 మంది ఉండనున్నారు. వీరికి అదనంగా 7,760 మంది పోలింగ్ సిబ్బందిని రిజర్వుడ్‌గా అందుబాటులో ఉంచనున్నారు.
‘బీసీ’ స్థానాల్లో పోటీకి ముస్లింలకు అవకాశం!
బీసీల్లో ‘ఏ, బీ, సీ, డీ, ఈ’ వంటి వర్గీకరణలతో సంబంధం లేకుండా కుల ధ్రువీకరణ పత్రం గల వారందరికీ బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ‘బీసీ-ఈ’ కేటగిరీలోని ముస్లిం అభ్యర్థులకు బీసీ రిజర్వు స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారా అని ప్రశ్నించగా.. ఈ సమాధానం ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉండడంతో ఈ అంశం కీలకంగా మారనుంది. ఇక హైదరాబాద్ నగరవ్యాప్తంగా అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తొలగిస్తామని నాగిరెడ్డి చెప్పారు. జీహెచ్‌ఎంసీ, స్థానిక ప్రైవేటు ఆస్తి యజమాని అనుమతితో ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మెట్రో రైలు పిల్లర్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎగ్జిట్ పోల్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలనే తామూ అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఎన్నికల తేదీలివీ..
ఎన్నికల ప్రకటన : ఈ నెల 12 (మంగళవారం)
నామినేషన్ల స్వీకరణ : 12 నుంచి 17వ తేదీ వరకు
(ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు - సెలవుల నేపథ్యంలో 14, 15వ తేదీల్లో విరామం)
నామినేషన్ల పరిశీలన : 18వ తేదీ ఉదయం 11 నుంచి..
ఉపసంహరణకు గడువు : 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు
అభ్యర్థుల తుది జాబితా, ఎన్నికల గుర్తుల కేటాయింపు: 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత
పోలింగ్ : ఫిబ్రవరి 2న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు
రీపోలింగ్ (అవసరమైతే) : ఫిబ్రవరి 4న
ఓట్ల లెక్కింపు : ఫిబ్రవరి 5న ఉదయం 8 నుంచి..
(ఈ ప్రక్రియ ముగిసిన మూడు రోజుల్లోగా (ఫిబ్రవరి 8లోగా) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక ప్రకటన జారీ)