పారిశుధ్యమా నీవెక్కడ..? | GHMC Elections Special Stories... | Sakshi
Sakshi News home page

పారిశుధ్యమా నీవెక్కడ..?

Published Tue, Jan 19 2016 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

పారిశుధ్యమా నీవెక్కడ..?

పారిశుధ్యమా నీవెక్కడ..?

ఎక్కడ చూసినా ‘చెత్త’ గుట్టలే. ఏ రహదారినా వెళ్లినా ముక్కుపుటలదిరే దుర్వాసనే. చెత్త డంపింగ్‌కు కాదేదీ అనర్హం.. అన్నట్టు మహానగరమంతా వ్యర్థాలతో నిండిపోతోంది. పారిశుధ్యం పడకేసి.. చారిత్రక భాగ్యనగరి.. పరమ ‘చెత్త’గా మారుతోంది. ఎందుకీ దుస్థితి..? దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల వైఫల్యం కాదా.? అవును ముమ్మాటికీ వారిదే ఈ మూల్యం. గ్రేటర్ ఎన్నికల వేళ మహానగరి మహాసమస్య మళ్లీ ముందుకొచ్చింది. వాగ్దానాల వాగ్బాణాలను ‘చెత్త’ బుట్టలో వేసే నాయకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ‘చెత్త’ను కడిగేసే ‘స్వచ్ఛ’మైన హామీలిచ్చే నాయకుడికే పట్టం కడతామంటున్నారు నగరవాసులు.      
 - సాక్షి, సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్, అంబర్‌పేట

 
4 వేల టన్నులు.. ప్రతిరోజు గ్రేటర్‌లో పోగవుతున్న చెత్త. ఇదీ జీహెచ్‌ఎంసీ అధికారుల లెక్క. కానీ అసలు లెక్క వేరు. లెక్కకు మిక్కిలి చెత్త నగరంలో పోగవుతోంది. పారిశుధ్యం పడకేసి అదంతా రోడ్లపైనే దర్శనమిస్తోంది. బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ డంపర్‌బిన్లు నిండిపోయి చెత్త చెల్లాచెదురవుతోంది. ఫలితంగా దుర్వాసన  వెదజల్లి, దోమలు వృద్ధి చెంది ప్రజలకు ప్రాణాంతక వ్యాధులొస్తున్నాయి. సాధారణ చెత్తకు ఎలక్ట్రానిక్ వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా తోడవుతుండడంతో ఇది మరింత ఎక్కువవుతోంది.
 
‘స్వచ్ఛ’తకు స్వస్తి..!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ పథకం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, సినీ ప్రముఖులు అందరూ రోడ్లెక్కి చెత్తను ఊడ్చి ఫొటోలకు ఫోజులిచ్చేశారు. సీఎం పార్శీగుట్ట డివిజన్‌ను దత్తత తీసుకోగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కో డివిజన్‌కు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. అయినా ఎక్కడ ‘చెత్త’ అక్కడే ఉండిపోతోంది. కారణం పథకం అమలులో అలసత్వం. నిర్వహణ లోపం.

‘స్వచ్ఛ హైదరాబాద్’ ప్రారంభమై 8 నెలలు అవుతోంది. నెలనెలా జరగాల్సిన ఈ కార్యక్రమం కేవలం తొలి రెండు పర్యాయాలు మాత్రమే జరిగిందంటే పరిస్థితి అర్థమవుతోంది. దీంతో పథకం ‘ఆరంభ శూరత్వం’గానే మారిందనే విమర్శలున్నాయి. మరోవైపు ‘స్వచ్ఛ హైదరాబాద్’లో చేసిన పనులకు ఎనిమిదినెలలైనా ఇంకా బిల్లులు చెల్లించలేదని వాహనాలు అద్దెకిచ్చిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు.
 
నిర్వహణ లోపమే అసలు సమస్య..!
నగరంలో 8 వేల కిలోమీటర్ల రహదారులుండగా.. కేవలం 2 వేల కి.మీ పరిధిలో మాత్రమే పారిశుధ్య నిర్వహణ చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడానికి ఇదే అసలు సమస్య. దీనికి తోడు కార్మికులు ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపర్‌బిన్లలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించకపోవడంతో పరిసరాలు పూర్తిగా చెత్త మయమవుతున్నాయి. కొన్ని డివిజన్లలో డంపర్‌బిన్లు లేక చెత్తను రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి.
 
సమస్యలిలా.. ‘స్వచ్ఛ’తెలా..?
* చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు 564 వాహనాలు ఉన్నాయి. చెత్త తరలింపునకు ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. వీటిలోనూ 458 మాత్రమే జీహెచ్‌ఎంసీవి. మిగతా 106 అద్దె వాహనాలు. వాహనాల్లోనూ సగం తుప్పు పట్టడంతో మరమ్మతులకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు.
* పారిశుధ్య కార్మికులు గ్రూపులో ఏడుగురు ఉండాలి. కానీ నలుగురైదుగురు మాత్రమే కనిపిస్తున్నారు. చాలా మంది పేర్లు హాజరుపట్టిలో ఉంటాయి. కానీ మనుషులుండరు. ఇలా సుమారు 5 వేల మంది జీతాలు కొందరి అక్రమార్కుల ఖాతాల్లోకి మళ్లుతున్నాయి. వీటిని పంచకుంటున్న వారిలో శానిటరీ సూపర్‌వైజర్లలు ఇతర సిబ్బంది, యూనియన్ల నేతలు కూడా ఉండడం గమనార్హం. నూతన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రారంభించిన ‘పరిచయం’ కార్యక్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. అవినీతి ఇంత బహిరంగంగా జరుగుతుంటే..
     
ఇక పారిశుధ్యం ఎప్పటికి బాగుపడుతుంది.?
* నగరంలో రోజుకు వందల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. నిజం చెప్పాలంటే గ్రేటర్ చెత్తలో ఇదే సగం. ప్లాస్టిక్ నిషేధించాలనే ప్రయత్నాలన్నీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఒత్తిడితో నీరుగారిపోయాయి. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించినా అమలు లేదు. కొన్నాళ్లు అమలు చేసి తర్వాత చేతులెత్తేశారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తేనే చెత్త సమస్యకు చెక్ చెప్పొచ్చు. ఇప్పటికే పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను రీసైక్లింగ్ చేయాల్సి ఉంది.
* ఐటీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ-వ్యర్థాలు) వెన్నంటే వెంటాడుతోంది. ఈ-వ్యర్థాల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై తర్వాత స్థానం హైదరాబాద్‌దే. గ్రేటర్‌లో ఏటా సుమారు 45 వేల టన్నుల ఈ-వ్యర్థాలు పోగవుతున్నాయి. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్ల చెత్తే 12 వేల టన్నులు ఉందని ఈటీ పీఆర్‌ఐ సర్వేలో తేలింది. వీటిలో 55 శాతం సాధారణ చెత్తతో కలుస్తుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
* వీటన్నింటితో పాటే బయోమెడి‘కిల్’ వేస్ట్ గ్రేటర్‌ను కలవరపెడుతోంది. ఆస్పత్రుల నుంచి వెలువడే ఈ డేంజర్ వేస్ట్‌ను సాధారణ చెత్తతో రోడ్లపైనే తగలబెడుతున్నారు. దీంతో 20 శాతం జనాభా అంటువ్యాధుల బారిన పడుతున్నారని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్‌లో ఏడాదికి 18 వేల టన్నుల బయోమెడి‘కిల్’ వ్యర్థాలు వెలువడుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) లెక్కల్లో తేలింది. నగరంలో ప్రతిరోజు 50 టన్నుల బయోమెడికల్ వేస్ట్ పరిసరాల్లో కలుస్తోంది.
 
ఏదీ ‘చెత్త’ శుద్ధి..?
సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించడం లేదు. రోడ్లపైనే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. దీంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. జీడిమెట్ల నాలా పక్కన ఎన్నో ఏళ్ల నుంచి చెత్త డంప్ చేస్తున్నారు. గతంలో అధికారులు వచ్చి చూసి వెళ్లినా ఇంత వరకు చెత్తను తరలించలేదు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేయాలి. ఆ దిశగా కృషి చేసే నాయకులకే నా ఓటు.
- సంతోష్, ఆటోడ్రైవర్, జయరాంనగర్
 
చెత్తతో నిత్యం కుస్తీలే..
పారిశుధ్య నిర్వహణ సరిగా లేక రోడ్లపై చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. చెత్త తరలింపునకు పాలకులు సరైన ప్రణాళికలు రూపొందించడం లేదు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ పథకం అమలు లేక అటకెక్కింది. గ్రేటర్ బరిలో నిలిచే పార్టీలు చెత్త నిర్వహణకు సరైన ప్రణాళికలతో ముందుకు రావాలి. ఆ దిశగా కార్యాచరణ రూపొందించే పార్టీకే నా ఓటు.     
- సిరాజుద్దీన్, అంబర్‌పేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement