వీల్‌చైర్‌పై పూజ
నల్లకుంట: అందరు పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన ఆ చిన్నారిని పుట్టుకతోనే వింత జబ్బు వెంటాడుతోంది. అయినా తల్లి దండ్రులు ఎంతో కష్టపడి, శక్తి మించినా దాతల సహాయంతో ఆ చిన్నారికి వైద్యం చేయిస్తున్నారు. కాళ్లు కొద్దిగా నయమైనప్పటికీ, చచ్చుబడిపోయిన చేతులకు ఆపరేషన్ చేయిస్తే కాని కదలేని పరిస్థితి. ప్రస్తుతం ఆ బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న పాఠశాల యాజమాన్యం ఆమె తరగతి గదిని ఏటా గ్రౌండ్ ఫ్లోరోలోనే నిర్వహిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... నల్లకుంటకు చెందిన విజయ్ శేఖర్ కుమార్తె పూజ(15) పుట్టుకతోనే ఆమ్యో ప్లాసియోవ్యాధిలో బాధపడుతోంది. దాతల సాయంతో ఐదేళ్ల క్రితం రూ.10 లక్షలు ఖర్చు చేసి ఆ చిన్నారి కాళ్లకు బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించడంతో ఆమె నడవగలుగుతోంది. అయితే ఐదేళ్ల తర్వాత ఆమె చేతులకు కూడా సర్జరీ చేయించాలని వైద్యులు సూచించారు. అందుకు తగిన స్తోమత లేకపోవడంతో ఆర్థిక సాయం చేసే దాతలకోసం ఆమె తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆస్తినంతా అమ్మగా వచ్చిన సొమ్ము, దాతలు ఇచ్చిన విరాళాలతో కాళ్లకు శస్త్ర చికిత్స చేయించ గలిగామని, ప్రస్తుతం ఫిజియో థెరపీ చేయించేందుకు నెలకు రూ.10 వేలు ఖర్చవుతుందని వారు వాపోయారు. చేతుల ఆపరేషన్ చేయించేందుకు మరో రూ.10 లక్షలు ఖర్చవుతుందని, చేయూతనందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. దాతలు పీవీ. పూజ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ 013210100013223 నంబర్‌కు విరాళాలు పంపించి ఆదుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సెల్ నంబర్ 97056 47223.