స్విస్ ఛాలెంజ్పై హైకోర్టు సీరియస్
హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు సీరియస్ అయింది. అసలు ఈ విధానం ఎవరి కోసమని ప్రశ్నించింది. కేవలం విదేశీ కంపెనీల కోసమేనా అని ప్రశ్నించింది. ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో ఇంత దాపరికం ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తులకు అధికారులు కేవలం ధర్మకర్తలు మాత్రమేనని, అంతే తప్ప ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోడానికి ఇవి ప్రైవేట్ ఆస్తులు కావని వ్యాఖ్యానించింది. అసలు స్విస్ ఛాలెంజ్ విధానం ఎందుకని ప్రశ్నించింది. సీల్డ్ కవర్ టెండర్ల విధానం మేలు కదా అంటూ ఆచరణలో మాత్రం వేరేవి జరుగుతున్నాయని ఈ విషయం అందరికీ తెలుసు అని వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు శుక్రవారం ఇస్తామని తెలిపింది.
స్విస్ ఛాలెంజ్ పద్ధతి అంటే...
కాగా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక అంటే... ఈ పద్ధతిలో బిడ్లను వేసిన తర్వాత, తక్కువ బిడ్ వేసిన వారికి కాంట్రాక్టును అప్పగించరు. తిరిగి పోటీలో ఉన్న కంపెనీ, అంతకన్నా తక్కువ ధరకు మెరుగైన డిజైన్ తో మరో ప్రణాళికను సమర్పించి కాంట్రాక్టును సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో సంస్థ ఇంకో డిజైన్ ఇచ్చి, అది అధికారులకు నచ్చితే కాంట్రాక్టు ఆ సంస్థకు లభించే అవకాశాలు దగ్గర చేసే పద్ధతి ఉంది. అదే స్విస్ ఛాలెంజ్ పద్ధతి. నియమిత సమయంలో ఓ కంపెనీ ఇలా ఎన్నిసార్లయినా కాంట్రాక్టును సవరించుకోవచ్చు.