ఇంటి అనుమతి.. ఇక ఈజీ!
మురికివాడల ప్రజలకు వెసులుబాటు
ఇంటి నిర్మాణ అనుమతుల్లో రాయితీ
చదరపు అడుగుకు రూ.10 నామమాత్రపు ఫీజు
ఆర్కిటెక్ట్/ ఇంజినీర్ నుండే ఇంటి నిర్మాణ అనుమతులు
బీపీఎస్‌పై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదనలు
నగరంలో బీపీఎస్‌ను అమలు చేయడంతోపాటు ఇంటి నిర్మాణ అనుమతుల్ని సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణానికి తప్పనిసరిగా అనుమతి తీసుకునేలా చూడాలని...ఆస్తి పన్ను రూపంలో ఆదాయం పెంచాలని యోచిస్తున్నారు. బీపీఎస్‌పై ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ ప్రతిపాదనల మేరకు మురికి వాడల్లో ఇళ్ల అనుమతికి చదరపు అడుగుకు రూ.
10 నామమాత్రపు ఫీజు తీసుకోవాలని భావిస్తున్నారు. అంటే వంద గజాల ఇంటి నిర్మాణానికి రూ.వెయ్యి మాత్రమే వసూలు చేస్తారు. ఇక అనుమతులు సైతం జీహెచ్‌ఎంసీ నుండి కాకుండా అధీకృత ఆర్కిటెక్ట్ లేదా ఇంజినీరు నుండే జారీ చేసేలా నిర్ణయం
తీసుకోవాలని యోచిస్తోంది.
సిటీబ్యూరో: ప్రభుత్వం త్వరలో అమల్లోకి తేనున్న బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) పథకంతోపాటు భవిష్యత్‌లో నిర్మాణ అనుమతుల్ని సులభతరం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పేదలు ఎక్కువగా ఉండే స్లమ్స్‌లోనూ తప్పనిసరిగా అనుమతులు తీసుకునేందుకు వీలుగా వారికి డెవలప్‌మెంట్ ఫీజులవంటివి ఏవీ లేకుండా నామమాత్రపు ఫీజు వసూలు చేయాలని భావిస్తోంది. అదీ చదరపు అడుగుకు కేవలం రూ. 10 నామమాత్రపు ఫీజుగా వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ విధానం పేదలకు ఉపకరించడమేకాకుండా.. అన్ని ఇళ్ల వివరాలూ రికార్డుల్లో నమోదు కాగలవని భావిస్తున్నారు. ప్రస్తుతం అనుమతులు పొందేందుకు ఉన్న ఇబ్బందులు.. టౌన్‌ప్లానింగ్ విభాగం అవినీతి తదితర కారణాల వల్ల స్లమ్స్‌లో నివసించే వారు చాలా వరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి రావాల్సిన నిర్మాణ అనుమతులు ఫీజుల సంగతటుంచి, ఆస్తిపన్ను జాబితాలోనూ సదరు ఇళ్లు చేరడం లేవు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు జరిపినప్పుడు మాత్రం ఆస్తిపన్ను జాబితాలో నమోదు చేస్తున్నారు. సంబంధిత సిబ్బంది చేయి తడిపితే అదికూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి ఏటా రావాల్సిన ఆస్తిపన్ను రాకుండా పోతోంది. కొత్త నిబంధనల్లో స్లమ్స్‌కు నామమాత్రపు ఫీజును ఖరారు చేస్తే అందరూ అనుమతి తీసుకోవడంతో పాటు ఇతరత్రా ఎన్నో విధాలుగా ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
2008లో బీపీఎస్‌ను అమల్లోకి తెచ్చినప్పుడు సైతం వాణిజ్యప్రాంతాలు, కాలనీల నుంచి క్రమబద్ధీకరణ కోసం ఎక్కువ దరఖాస్తులందగా, స్లమ్స్‌నుంచి అందలేదు. స్లమ్స్‌లో డీవియేషన్లు జరిగినా, తక్కువ విస్తీర్ణంలోవే కనుక ఎవరూ పట్టించుకోలేదు. తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ అంతస్తులు లేపడంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యకు కూడా పరిష్కారం కోసం సెట్‌బ్యాక్ నిబంధనల్ని మార్చాలని భావిస్తున్నారు. ఫ్రంట్ సెట్‌బ్యాక్‌ను ప్రస్తుతమున్న 1.5 మీటర్ల నుంచి 1 మీటరుకు తగ్గించాలనిచ 120 చ.గ.లలోపు ఇళ్లకు వీలైనంత మేరకు తక్కువ సెట్‌బ్యాక్‌ను వర్తింపచేయాలని భావిస్తున్నారు. నగరంలో భూముల విలువ దృష్ట్యా, సెట్‌బ్యాక్ నిబంధనల్ని పాటించడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఇది ఉపకరిస్తుంది. రోడ్డు వెడల్పు కూడా ప్రస్తుతమున్న 30 అడుగుల నుంచి 12 అడుగులకు కుదిస్తారు. ఈ మేరకు ఈ అంశంపై ఏర్పాటైన సబ్‌కమిటీ వీటిని ప్రతిపాదించింది. ఇంకా, స్లమ్స్‌లో చాలా ఇళ్లకు ఓనర్‌షిప్ టైటిల్ లేకపోవడం, అనుమతుల చార్జీలు భరించలేకపోవడం వల్లే అనుమతులు తీసుకోలేదని అంచనా వేసిన సబ్‌కమిటీ స్లమ్స్‌లోని వారికి పట్టాలివ్వడం ద్వారా ఓనర్‌షిప్ వర్తింపచేయాలని భావించింది. దాదాపు 1.50 లక్షల మందికి పట్టాలివ్వాలనే యోచనలో ఉంది. అనుమతుల ఫీజు తగ్గిస్తే అందరూ అనుమతులు తీసుకుంటారని అంచనా వేసింది.
ఆర్కిటెక్ట్/ ఇంజినీర్లే అనుమతులిస్తారు
స్లమ్స్‌లో ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారు అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీ కార్యాలయాల దాకా వెళ్లకుండా జీహెచ్‌ఎంసీ గుర్తింపు పొందిన అథరైజ్డ్ ఆర్కిటెక్ట్/ఇంజినీర్లు సర్టిఫై చేస్తే చాలునని భావిస్తున్నారు. అంటే వారు సర్టిఫై చేస్తే నిర్మాణ అనుమతి పొందినట్లే. దీంతోపాటు చిన్న ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకునేవారికి తనఖా నిబంధనను ఎత్తివేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం 120 చదరపుగజాల్లోపు ఇల్లు నిర్మించుకునే వారికి ఒక అంతస్తు వరకు మాత్రమే తనఖా నిబంధన లేదు. దీనిని జీ ప్లస్ 2 వరకు అనుమతించాలని ప్రతిపాదించారు. అంతకు మించిన వాటికి వర్తింపచేసే తనఖాలను సైతం అందరికీ తెలిసేలా ఆన్‌లైన్‌లో ఉంచాలని భావిస్తున్నారు. తద్వారా అక్రమ నిర్మాణాలకు వీలుండదని అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ సీఎం పరిశీలించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు.