నయీమ్‌కు ఆయుధాలెక్కడివి?
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు జరుపుతున్న సోదాల్లో అత్యాధునిక తుపాకులు బయటపడుతున్నాయి. నయీమ్ ఇళ్లతోపాటు అతని అనుచరుల వద్ద కూడా భారీగా ఆయుధాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు 19 వెపన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా వాటిలో ఎక్కువ భాగం జర్మనీ, బెల్జియం, రష్యా తయారీవే కావడం గమనార్హం.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఏకే 47తోపాటు 9 ఎమ్‌ఎమ్ పిస్టళ్లు, తపంచాలు, భారీగా తూటాలు, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, గొడ్డళ్లు, కత్తులు ఉన్నాయి. వాటిలో కొన్ని వెపన్స్‌ను నయీమ్ గ్యాంగ్ ఉపయోగించినట్లు గుర్తించారు. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి నయూమ్‌కు సమకూరాయనేది పోలీసులకు అంతబట్టడం లేదు. దాదాపు 4 రోజులు విస్తృతంగా గాలిస్తున్నా ఆయుధాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. పట్టుబడిన నయీమ్ అనుచరులను ప్రశ్నిస్తున్నా ‘అంతా భాయ్’ చూసుకునే వాడంటూ సమాధానం ఇస్తున్నారు.
ఆయుధాలు సమకూర్చిందెవరు..?
నయీమ్‌కు వివిధ రంగాలలో ఉన్న వారితో విస్తృత పరిచయాలున్నాయి. మాజీ మావోయిస్టు నేత కావడంతో నక్సల్స్‌తో కూడా పరిచయాలున్నాయి. దీంతో నక్సల్స్ నుంచి ఆయుధాలు సరఫరా అయ్యాయా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే నయీమ్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లు గతంలోనే పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అంతేకాదు హిజ్బుల్ నేత ముజీబ్‌తో కలసి నయీమ్ అక్రమంగా ఆయుధాల వ్యాపారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి పాకిస్తాన్ వెళ్లి దావుద్ ఇబ్రహీంను కలసి చర్చించినట్లు సమాచారం. మరోసారి దుబాయ్ వెళ్లి అక్కడ డీ-గ్యాంగ్ సభ్యులతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిసింది.