ఆమ్లెట్ పెట్టలేదని.. భార్యకు నిప్పంటించాడు!
హైదరాబాద్: తాగిన మైకంలో ఉన్న ఓ భర్త.. తాను ఆమ్లెట్ అడిగితే పెట్టలేదన్న కోపంతో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఉదంతంలో బాధితురాలు తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దుర్ఘటన పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధి బాలాపూర్ రోషన్‌ద్దాలా ప్రాంతంలో జరిగింది.
ఆకపోగు సదేశమ్మ(30), నరేష్ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా అయిన నరేష్ కొన్నాళ్లుగా తాగుడుకు బానిసై భార్యను వేధిస్తున్నాడు. తాగిన మైకంలో ఉన్న నరేష్.. సదేశమ్మను ఆమ్లెట్ వేయమన్నాడు. ఆమె వేసినా, చిన్న కొడుకు శామ్యూల్ అడగడంతో అతడికి ఇచ్చింది. దీంతో ఆగ్రహించిన నరేష్ పక్క గదిలో ఉన్న కిరోసిన్‌ను తీసుకొచ్చి భార్య ఒంటిపై పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకూ వారు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. 96 శాతం గాయపడిన సదేశమ్మ చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. భర్తతో పాటు అత్తింటి వారు కూడా తనను వేధించేవారని సదేశమ్మ పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.