ఇలాగైతే బడి బతికేదెట్లా?
పిల్లలున్నా టీచర్లను ఇచ్చేందుకు సర్కారు వెనుకంజ
- స్కూళ్లపై పర్యవేక్షణ గాలికి ..
- రాష్ట్రంలోని మొత్తం పాఠశాలలకు పర్యవేక్షకులు 50 మందే
- నాణ్యతా ప్రమాణాలు పట్టించుకునే నాథుడే లేడు
- ఫలితంగా బడులు మానేస్తున్నవారు కొందరు..
- ప్రైవేటుకు వెళ్తున్నవారు ఇంకొందరు
- ఏటేటా స్కూళ్లలో తగ్గిపోతున్న విద్యార్థులు
- ఇదే సాకుతో బడుల మూసివేతకు సర్కారు కసరత్తు
- రాష్ట్రంలో 3,600 స్కూళ్లకు మూసివేత ముప్పు
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: రాష్ట్రంలోని పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తాం.. డ్రాపౌట్స్ తగ్గిస్తాం.. ప్రభుత్వం చెబుతున్న మాటలివీ! కానీ సర్కారు తీరుతో మెరుగైన విద్య కాదు కదా.. నిరుపేదలు అసలు బడికే దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. తక్కువ విద్యార్థులున్న స్కూళ్లను మూసివేయాలన్న ప్రభుత్వ యోచనతో డ్రాపౌట్స్ మరింతగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. పది మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్లను మూసివేయాలన్న ప్రభుత్వ ఆలోచన.. ప్రైవేటు స్కూళ్లలో చదువుకునే స్తోమత లేని పేద విద్యార్థుల పట్ల శాపంలా మారనుంది. ఇది చివరకు ప్రభుత్వ పాఠశాలల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని, పరోక్షంగా ప్రైవేటు విద్యకు ఊతమివ్వడమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. అనేకచోట్ల పిల్లలున్నా టీచర్లను ఇవ్వడం లేదు.
మరికొన్ని చోట్ల టీచర్లు ఉన్నా సరిగా రావడం లేదని, చదువులు చెప్పడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ప్రభుత్వ బడిపై నమ్మకం కోల్పోయి తమ పిల్లల్ని.. ఆర్థిక భారమైనా ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ప్రభుత్వం మాత్రం అసలు సమస్యకు చికిత్స చేయకుండా.. విద్యార్థులు లేరన్న సాకుతో బడుల మూసివేతకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రైవేటు స్కూళ్లు మూడేళ్ల వయసులోనే పిల్లల్ని ఇంగ్లిష్ చదువులతో ఎల్‌కేజీలో చేర్చుకుంటున్నాయి. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఐదేళ్లు నిండాకే చేర్చుకుంటున్నాయి. అలాగే ప్రైవేటు స్కూళ్లలో ప్రతి తరగతికి ఒక క్లాస్ టీచర్, ప్రాథమిక స్థాయిలోనూ ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ను ఏర్పాటు చేస్తుంటే.. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం పిల్లలు తక్కువున్నారన్న సాకుతో ఒకరిద్దరు టీచర్లను ఇచ్చేందుకు కూడా వెనకాడుతోంది. సరిపడ టీచర్లు లేక పోవడం, చదువులు సరిగా సాగకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కారు బడికి పంపేందుకు ఇష్టపడడం లేదు.
3,600 స్కూళ్లకు మూసివేత ముప్పు!
రాష్ట్రంలో ఏకంగా 3,600కు పైగా బడుల మూసివేత ముప్పు పొంచి ఉంది. ఒక్క విద్యార్థి కూడా లేడనే సాకుతో 405 పాఠశాలలను, పది మందికంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారంటూ 991 పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేస్తుండడంతో పది జిల్లాల్లో 1,400 పాఠశాలలు మాయం కానున్నాయి. ఇక రాష్ట్రంలో రెండు రకాల విద్యా వ్యవస్థే ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వ్యవస్థ కొనసాగుతోంది. ఇలా కాకుండా రెండే వ్యవస్థలు(ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు) ఉండేలా కసరత్తు చేస్తోంది. దీంతో మరో 3,224 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలల్లో కలిసిపోనున్నాయి. అయితే 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల లేకుంటే మాత్రం ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రే డ్ చేయాలని భావిస్తోంది. అప్‌గ్రేడ్ అయ్యే పాఠశాలలు వెయ్యి వరకు ఉన్నా.. మరో 2,200పైచిలుకు పాఠశాలలకు తాళం పడనుంది.
డ్రాపౌట్స్ తగ్గించే చర్యలేవి?
రాష్ట్రంలో డ్రాపౌట్స్‌ను తగ్గించే చర్యలు కనిపించడం లేదు. ఒకటో తరగతిలో వంద మంది చేరితే ఐదో తరగతికి వచ్చే సరికి వారిలో 22 మంది బడి మానేస్తున్నారు. 8వ తరగతికి వచ్చే సరికి 32 మంది, పదో తరగతికి వచ్చే సరికి 38 మంది స్కూలు మానేస్తున్నారు. వీరిలో ఎక్కువగా పేదలు, అణగారిన వర్గాల పిల్లలే ఉంటున్నారు. ఎస్సీల్లో 40.32 శాతం డ్రాపౌట్స్ ఉండగా, ఇది ఎస్టీల్లో 62.81 శాతంగా ఉంది.
పర్యవేక్షకులు ఎక్కడ
రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లపై పర్యవేక్షణకు 462 మంది మండల విద్యాధికారులు (ఎంఈవో) ఉండాలి. అయితే 420 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఉప విద్యాధికారి (డిప్యూటీ ఈవో) పోస్టులు 67 ఉంటే అందులోనూ 59 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల పర్యవేక్షణకు 50 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. ఇలా స్కూళ్ల పనితీరును పర్యవేక్షించేవారు లేక క్షేత్ర స్థాయిలో విద్యావ్యవస్థ గాడి త ప్పుతోంది.
ఇది మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద పాఠశాల. పదో తరగతి దాకా ఉంది. 512 మంది విద్యార్థులు ఉన్నారు. టీచర్ మాత్రం ఒక్కరే. తరగతి గదులూ సరిపడలేవు.
163 మంది పిల్లలు.. ఒక్క టీచరు
ఇది మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలంలోని గుడుదొడ్డిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. ఇందులో 163 మంది విద్యార్థులున్నారు. 8 మంది టీచర్లు ఉండాలి. కానీ ఒక్కరే ఉన్నారు.
ఇది గద్వాల పట్టణం గంటవీధిలోని దోబీవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఒకటి నుంచి ఐదో తరగతి వరకున్న ఈ పాఠశాలలో 21 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కరే టీచరు. సొంత భవనం లేదు. ఇప్పుడు మూత పడే పరిస్థితిలో ఉంది. బడి మూతపడితే ఆ పిల్లల్లో సగం మంది చదువుకు దూరమైనట్టే.
బడి మూసేస్తే మా పిల్లల్ని ఎక్కడికి పంపాలి?
ఈ ఊళ్లో ఉన్న 30 మంది పిల్లలు సర్కారు బడికే వెళ్తరు. కొద్దో, గొప్పో స్తోమత ఉన్నవాళ్లు ఇంగ్లిష్ చెప్పించడానికి పట్నం తోలుతున్నరు. ఉన్న బడిని మూసేస్తే మేం మా పిల్లల్ని ఎక్కడికి పంపాలె. మా పిల్లలు సదువుకోవద్దా?
- నునావత్ అరుణ, కారేపల్లి, అలియాబాద్ తండా, ఖమ్మం
ఇట్లయితే పిల్లలకు సదువెట్టా వస్తది
ఆరగిద్ద ఉన్నత పాఠశాలలో ఒక్క టీచరే 1 నుంచి 10 తరగతి వరకు చూడాలంటే కష్టం కాదా? ఇట్లయితే పిల్లలకు చదువు ఎట్లా వస్తది. మాకు మరో మార్గం లేక పిల్లల్ని ఈ బడికి పంపుతున్నం..
- తిప్పన్న, ఆరగిద్ద, విద్యార్థి తండ్రి
పది ఎట్లా పాసైతమో తెలియడం లేదు
తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదిలో అడుగు పెడుతున్నాం. మాకు ఒక్కరే టీచర్ ఉన్నాడు. ఒక్కరితో పదిలో గట్టెక్కుతామో లేదో తెలియడం లేదు. వేరే ఊరికి వెళ్లి చదువుకోలేక తప్పని పరిస్థితుల్లో ఇక్కడే కొనసాగుతున్నాం. పది ఎట్లా పాస్ కావాలో అర్థం కావడం లేదు.
- తిమ్మప్ప, ఆరగిద్ద స్కూల్ విద్యార్థి, మహబూబ్‌నగర్
సార్లు మంచిగా వస్తే బడి నడుస్తది..
మా బడి మూత పడితే చాలా దూరం నడిచిపోవాలి. సార్లు మంచిగా బడికి వత్తే అందరం స్కూల్‌కు వచ్చేవాళ్లం. వాళ్లే సక్కక వస్తలేరు. దీంతో కొందరు విద్యార్థులు చెన్నూర్ పోతుండ్లు. బడిలో ఐదారుగురమే మిగిలాం.
- సహస్ర, ముత్తారవుపల్లి, ఆదిలాబాద్ జిల్లా
వసతుల్లేక 100 మంది ప్రైవేటు బాట
రంగారెడ్డి జిల్లా పరిగి మండలంలోని రంగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సరిపడ తరగతి గదుల్లేక పిల్లల్ని ఇలా వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. ఎనిమిదో తరగతి వరకున్న ఈ స్కూల్లో 176 మంది విద్యార్థులున్నా.. సరిపడ తరగతి గదుల్లేవు. ప్రహరీ గోడ లేదు. నాలుగేళ్ల కింద ప్రారంభించిన తరగతి గదుల నిర్మాణం పునాదుల వద్దే ఆగిపోయింది. వసతుల్లేక గ్రామానికి చెందిన సుమారు 100 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లారు.