సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోవడంతో 23మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు.
హైదరాబాద్: ట్రాఫిక్ జామ్‌తో సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోవడంతో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు తొలిరోజు పరీక్షకు దూరమయ్యారు. మార‍్గమధ‍్యంలో బస్సు ఫెయిల్ కావడం వల‍్ల పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో 23 మంది పరీక్ష రాయలేకపోయారు.
బుధవారం ఉదయం ఆలస్యంగా వచ్చిన విద్యార్థినులను కూకట్‌పల్లి నిజాంపేటలోని శ్రీచైతన్య బాలికల కళాశాల సిబ్బంది లోనికి అనుమతించలేదు. పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నందున తామేమీ చేయలేమని నిర్వాహకులు చెప్పడంతో విద్యార్థులు ఆవేదన చెందారు.
తాము సకాలంలోనే బయలుదేరామని, బస్సు చెడిపోవడంవల‍్లే ఆలస‍్యమైందని, అందువల‍్ల తమకు న్యాయం చేయాలని వారు కోరారు. వీరంతా ఆదిత్యాభవన్ ఐఐటీ క్యాంపస్‌కు చెందిన విద్యార్థినులు. కాగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.