
కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్‌ది హత్యా?
- అతన్ని చంపించింది నేనే..
- డబ్బులివ్వకుంటే నీ కొడుకునూ చంపిస్తా
- వ్యాపారి నాగేందర్‌ను బెదిరించిన నయీమ్
- 2011లో ఔటర్‌పై ‘ప్రమాదం’లో మరణించిన ప్రతీక్
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి చనిపోయింది రోడ్డు ప్రమాదంలో కాదా? గ్యాంగ్‌స్టర్ నయీమే అతన్ని హత్య చేయించాడా? అది హత్యేనని, తానే చేయించానని నయీమే తనతో స్వయంగా చెప్పాడని వ్యాపారి గంపా నాగేందర్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం రేపుతోంది. తన కొడుకునూ అలాగే చంపుతానంటూ నయీమ్ బెదిరించాడని అందులో నాగేందర్ పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆ రోజు ఏం జరిగింది...?
కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ‘కారు ప్రమాదం’లో చనిపోయాడు. అతనితోపాటు స్నేహితులైన సుజీత్‌కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ప్రమాదమేనని, పటాన్‌చెరు వైపు వస్తుండగా గొర్రెలను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పిందని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. సర్వీసు రోడ్డు పక్కనున్న మట్టి, రాళ్ల కుప్పను ఢీకొని కారు ఎగిరిపడిందని తేల్చారు. ప్రతీక్ మృతదేహం రోడ్డుకు 20 అడుగుల దూరంలో పడింది. ఇది రోడ్డు ప్రమాదంగానే పోలీసు రికార్డుల్లో ఉండిపోయింది. అయితే ప్రతీక్‌ను తానే చంపించానని నయీమే స్వయంగా చెప్పాడని నాగేందర్ తాజాగా ఆగస్టు 17న భువనగిరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘గత మార్చి 18న నయీమ్ అనుచరులు నన్ను నయీమ్ వద్దకు తీసుకువెళ్ళారు. రూ.5 కోట్లివ్వాల్సిందిగా నయీమ్ నన్ను డిమాండ్ చేశాడు.
లేదంటే నా కుటుంబీకుల్ని హతమారుస్తానన్నాడు. రోడ్డు ప్రమాదంగా కన్పించేలా నా కుమారుల్ని చంపుతానన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకునూ అలాగే చంపానన్నాడు. అది హత్య అని ఎవరూ గుర్తించలేదని చెప్పుకొచ్చాడు’’ అని వివరించారు. పోలీసులు మాత్రం కేవలం నయీమ్ బెదిరింపుల కోసం చెప్పిన మాటల ఆధారంగా దీనిపై ఓ నిర్ణయానికి రాలేమంటున్నారు. అయితే ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తామని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలంటూ నయీమ్ తనను బెదిరించాడని వెంకట్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవలే ప్రకటించడం తెలిసిందే.