మీ హయాంలో ఒక్కరికైనా సాయమందిందా?
కాంగ్రెస్‌ను ప్రశ్నించిన ఈటల
⇒ అలాగని నిరూపిస్తే రాజీనామా చేస్తా
⇒ కాంగ్రెస్‌కు మరో పదేళ్లు భవిష్యత్తుండదు
⇒ ఆ తరహాలో సంక్షేమ పాలన అందిస్తం
⇒ కులవృత్తులను కించపరుస్తున్న విపక్షాలు
⇒ మోటార్లు కాలిపోయినా, చివరి పొలాలకు నీరందకున్నా ముక్కు నేలకు రాస్తా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో ఒక్క కుటుంబానికైనా రూ.5 లక్షల ఆర్థిక ప్రయోజనం కలిగించినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ సవాలు విసిరారు. శనివారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఎస్సీలకు భూ పంపిణీ కోసం కాంగ్రెస్ పాలనలో రూ.76 కోట్లు ఖర్చు చేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.406 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి భూముల కొనుగోలు కోసం రూ.15 నుంచి 20 లక్షలు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వానిది’’ అని చెప్పారు. ‘‘ఏడాదిలోనే బీసీలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభిస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటుంటే ముక్కు నేలకు రాస్త. కరెంట్ మోటార్లు కాలిపోయినా, చివరి పొలాలకు కరెంట్ రాకపోయినా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం’’ అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అంకెలు పట్టుకుని ఆరోపణలు చెయ్యొద్దు.. ఆచరణలో జరుగుతున్న పనులను చూడాలంటూ హితవు పలికారు. వికలాంగులకూ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు.
నాయకులకు సోయి ఉండాలె
అభివృద్ధి, సంక్షేమ కార్యకమాలతో కాంగ్రెస్‌కు మరో పదేళ్లు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని ఈటల అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలే తప్ప కులాలను కించపరుస్తూ, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. గొర్రెలు, మేకలు, పందులు అంటూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, తద్వారా కులవృత్తులను కించపరిచేందుకు విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆక్షేపించారు. తాను కోళ్ల ఫామ్ నడిపిన స్థాయి నుంచి ఆర్థికమంత్రిగా ఎదిగానన్నారు. ‘‘విపక్షాలు ఆరోపణలు, లెక్కలతో ప్రజలను నమ్మించజూస్తున్నయి. కానీప్రజలు తెలివైనవారు. ఎవరేం చేశారో తేల్చేది వారే. నేతలంటే కేవలం విమర్శలు చేయడం కాదు. సమస్యల పరిష్కార బాధ్యత ఉందనే సోయి ఉండాలి.
లేదంటే ప్రమాదం. మూడేళ్లలోనే దేశ చిత్రపటంపై గొప్ప రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతున్నదని చెప్పగలిగినం. ప్రభుత్వం తెచ్చిన 350 జీవోలను అమలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే. మా ప్రభుత్వానికి మానవత్వముంది. ఉత్తర్వులపై కంటే ప్రజలపై నమ్మకముంది. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్య బారిన పడ్డ రైతుల కుటుంబాలకు రూ.లక్షన్నర ఇస్తే మా ప్రభుత్వం రూ.6 లక్షలు ఇస్తున్నది. ప్రకృతి వైపరీత్యంతో మరణిస్తే రూ.5 లక్షలిస్తున్నం. బడ్జెట్ నిధులు మొత్తం ఖర్చు కాలేదంటున్నరు. ఛత్తీస్‌గఢ్, హరియాణా, కేరళ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ 79–86 శాతం మధ్యే ఖర్చు చేశాయి. చివరకు కేంద్రంలోనూ అంతే’’ అని వివరించారు. రెండున్నరేళ్లలో 42 వేల మందికి ఉద్యోగాలిచ్చామన్నారు. రాబోయే రెండేళ్లలో మరో 60 వేల ఉద్యోగాలు ఇస్తామని ఆశాభావం వెలిబుచ్చారు.
పీసీ సర్కార్ బడ్జెట్: షబ్బీర్ అలీ
తామెవరినీ కించపరచలేదని విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. పందుల పెంపకానికి ఆధునిక ఫాంలను ఏర్పాటు చేసుకోవాలని మాత్రమే సూచించామన్నారు. ‘‘ప్రజల నమ్మకాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వమ్ము చేసింది. బడ్జెట్ పీసీ సర్కార్ మ్యాజిక్‌లా ఉంది. అల్లావుద్దీన్ అద్భుత బడ్జెట్ అయితే తప్ప రూ.1.49 లక్షల కోట్లను వ్యయం చేయలేరు. జెన్‌కో ద్వారా ఒక్క మెగావాట్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేకపోయారు. మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్‌లలో 48– 60 శాతమే ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చనిపోయిన వారికి అంబులెన్సులకు దిక్కు లేదు గానీ గొర్రెలకు ఏమైనా అయితే అంబులెన్సుల్లో తీసుకెళతామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. డీఎస్సీ, గురుకుల టీచర్ల నోటిఫికేషన్లు ఇచ్చి రద్దు చేశారు. పిల్లీ ఎలుక ఆటాడుతున్నారు. పలు పంటలకు ధర లేదు. అక్షరాస్యతలో దేశంలోనే చివరి స్థానంలో ఉంది’’ అన్నారు. చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం శాసన మండలిని ఈనెల 24వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.