కోమటిరెడ్డిపై దాడి అమానుషం
టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తిన జానా
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. నల్లగొండ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధిపత్య ధోరణితో వ్యవహరించిందని, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగిందన్నారు. పోలీసుల లాఠీచార్జీలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని, ప్రభుత్వ దుందుడుకు చర్యలను తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా నాయకులతోపాటు కోమటిరెడ్డితో త్వరలో సమావేశమై ఒక కార్యాచరణ చేపడతానన్నారు.
ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం అమానుషం: షబ్బీర్
తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమంలో ఎమ్మెల్యేను పాల్గొననీయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మండలి కాంగ్రెస్ విపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ప్రతిచోటా అధికార కార్యక్రమాల్లో విపక్ష ప్రజాప్రతినిధులను పాల్గొననీయకుండా చేయడం అమానుషమని పేర్కొన్నారు. మంత్రులు ఈ వైఖరిని విడనాడకుంటే, ఇకపై జరిగే పర్యవసానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని షబ్బీర్ అలీ హెచ్చరించారు.
హోంమంత్రి రాజీనామా చేయాలి: మల్లు రవి
స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డికి ప్రొటోకాల్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని పీసీసీ ఉపాధ్యక్షుడు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జి మల్లు రవి విమర్శించారు. ప్రభుత్వ చెప్పుచేతల్లో పోలీసురాజ్యం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో పోలీసుల వైఫల్యాలకు నైతిక బాధ్యతగా హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.