'టీఆర్ఎస్ కారు స్టీరింగ్ మజ్లిస్ నడిపిస్తోంది'
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే నైతిక అర్హత తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు లేదని బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లో కె. లక్ష్మణ్ మాట్లాడుతూ... మజ్లిస్ను ఒప్పించడానికే ఒవైసీ కనుసన్నల్లో ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ కుమ్మక్కై దొడ్డిదారిన హైదరాబాద్ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు.
ఏడాదిన్నరగా టీఆర్ఎస్ కారు స్టీరింగ్ను మజ్లిస్ నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 60 వేల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని... ఆ కార్యక్రమాల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీని పిలవలేదని కె.లక్ష్మణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రులు ఎన్నికలు, ఉప ఎన్నికలు కోసమే తప్ప పరిపాలన చేసేందుకు కాదని కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు కొనసాగుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో సీట్లు పంచుకుని సమన్వయంతో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జనవరి 12వ తేదీన హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ చెప్పారు.
ఈ సభకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జేపీ నద్దా, దత్తాత్రేయ హాజరవుతారని వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య హైదరాబాద్ నగరంలో నాలుగు బహిరంగ సభలు నిర్వహిస్తామని... ఈ సభలకు కేంద్రమంత్రులు హాజరవుతారన్నారు. జనవరి 28,29,30 తేదీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారని లక్ష్మణ్ చెప్పారు. సెప్టెంబర్ 17 వ తేదీని తెలంగాణ విమోచన దినంగా ఎందుకు జరపలేదో సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.