కదిలిన కాషాయ దళం
ప్రచార వ్యూహాల తో ముందుకు
55 స్థానాల్లో గెలుపుపై బీజేపీ గురి
సిటీబ్యూరో : గ్రేటర్ పీఠమే లక్ష్యంగా కాషాయ దళం ఎన్నికల పోరుకు సిద్ధమైంది. టీడీపీ పొత్తుతో అగ్రనేతలు అభ్యర్థుల తరఫున ప్రచార వ్యూహాలతో ముందుకెళ్లేందుకు శ్రేణులను సన్నద్ధం చేశారు. కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తెచ్చి హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామన్న హామీతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూట మి బరి లోకి దిగుతోంది. గత సాధారణ ఎన్నికల్లో నగరంలో 5 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకున్న బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో సైతం అదే ఊపును కొనసాగించాలని యోచి స్తోంది. గ్రేటర్‌లో 87 స్థానాల్లో టీడీపీ, 63 స్థానా ల్లో బీజేపీ సిద్ధమయ్యాయి. మజ్లిస్, టీఆర్ ఎస్‌లకు బల్దియా పీఠం దక్కకుండా చేస్తామని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు.
మేయర్ పీఠాన్ని చేజిక్కించుకొనేందుకు అవసరమైన వనరులను సమకూర్చుకునేందుకు గ్రేటర్ బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బస్తీల్లో ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు, రోడ్ కార్నర్ మీటింగ్‌లతో ఓటర్లను ఆకర్షించవచ్చన్న ఉద్దేశంతో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. పార్టీని విజయం దశగా నడిపే భారమంతా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భుజానికి ఎత్తుకున్నారు. పార్టీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఆయన ఎన్నికల్లో కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా ఉన్నారు. పెద్ద సంఖ్యలో బీజేపీ-టీడీపీ కార్పొరేటర్లను గెలిపించడం ద్వారా సత్తా చాటుకునేందుకు ప్రణాళికబద్ధం గా వ్యవహరిస్తున్నా రు. మజ్లిస్‌ను అడ్డుకోవడమే తమ ధ్యేయమని ప్రకటించడం ద్వారా పాతబస్తీలో మైనార్టీయేతరులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. 2002 కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో గోదాలోకి దిగిన బీజేపీ మళ్లీ అదే పరిస్థితిని పునరావృతం చేయాలని ఆరాటపడుతోంది. పాత నగరంలో తమ పట్టును మ రింత పటిష్టం చేసుకునేందుకు గ్రేటర్ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని నేతలంతా కలసికట్టుగా ముందుకు కదులుతున్నారు.
నేడు నామినేషన్లు
నగరంలో తమకు కేటాయించిన 63 డివిజ న్ల లో అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ... వారి కి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. నామినేషన్లకు తుది గడువు ఆదివారంతో ముగియనున్నందున శనివారం అర్థరాత్రి నుంచి ఆదివా రం ఉదయం 10 గంటలలోపే అభ్యర్థులకు బి-ఫారాలు అందించేలా నగర బీజేపీ ఏర్పా ట్లు చేసింది. ఒక్కో డివిజన్‌కు ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసిన ‘ఎన్నికల కమిటీ’ ఇద్దరికీ ఫోన్ చేసినట్లు సమాచారం. వారిని పిలిపిం చి... పార్టీ నిర్ణయాన్ని వెల్లడించి.. గెలిచిన తర్వాత పార్టీ మారనన్న హామీ ఇచ్చాకే వారి లో ఒకరికి బి-ఫారం ఇవ్వాలని నిర్ణయిం చినట్లు సమాచారం. బి-ఫారాలు అందకపోయినా శనివారం సుమారు 93 మంది బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.