లాఠీలు, తూటాలతో గొంతు నొక్కలేరు
♦ మరెందరు రోహిత్‌లను బలి తీసుకుంటారు?
♦ ప్రజాస్వామ్య పరిరక్షణకే మా పోరాటం: కన్హయ్య
సాక్షి, హైదరాబాద్: ‘‘లాఠీలు ఝళిపించి, తూటాలు కురిపించి ఉద్యమాలను ఆపలేరు. మా గొంతు నొక్కలేరు’’ అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కన్హయ్యకుమార్ హెచ్చరించారు. కొద్ది నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లిని పరామర్శించడానికి బుధవారం సాయంత్రం వర్సిటీకి చేరుకున్న కన్హయ్య బృందాన్ని ప్రధాన ద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. లోనికి ప్రవేశాన్ని నిరాకరించారు. వర్సిటీతో సంబంధం లేని బయటి వ్యక్తులెవరినీ లోపలికి అనుమతించొద్దని పైనుంచి ఆదేశాలున్నాయని అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
ఈ విషయంలో తామేమీ చేయలేమని తేల్చిచెప్పారు. దాంతో హెచ్‌సీయూ ప్రధాన ద్వారం ముందు భారీగా గుమిగూడిన ప్రాంతీయ, జాతీయ మీడియానుద్దేశించి కారు ఫుట్‌బోర్డుపై నిలబడే కన్హయ్య ప్రసంగించారు. రోహిత్ లాంటివాళ్లను మరెంతమందిని బలి తీసుకుంటారని ఆవేశంగా ప్రశ్నించారు. స్వతంత్ర భారతదేశంలో మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, సమైక్యతను కాపాడేందుకు మేం పోరాడుతున్నాం. మిత్రుడు రోహిత్‌కు న్యాయం జరిగేందుకు, రోహిత్ చట్టం అమలు కోసం పోరాడుతున్నాం. రోహిత్‌కు న్యాయం కోసం, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ బలిపీఠమెక్కిన రోజున హెచ్‌సీయూకు వచ్చాం. కానీ బాధాకరమైన విషయమేమిటంటే కేంద్రం విద్యార్థుల గొంతు వినడం లేదు.
మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వని హెచ్‌సీయూ యంత్రాంగం, పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని లోనికి అనుమతించని హెచ్‌సీయూ పాలకులకు ఒక్కటే చెప్పదలిచా. లాఠీలు ఝళిపించినా, ఆస్పత్రులపాలు చేసినా మా గొంతు నొక్కలేరు’’ అన్నారు. అంబేడ్కర్, షహీద్ భగత్‌సింగ్ కలలుగన్న భారతావనిని నిర్మిస్తామన్నారు. రోహిత్ కలలను సాకారం చేయాల్సి ఉందన్నారు. అందుకోసం దేశంలో సామాజిక న్యాయం అమలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
తాము హింసను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఈ దేశంలో కులవాదం, అస్పృశ్యత, అగ్ర, నిమ్నవర్ణ భేదాల నుంచి విముక్తి లభించాలి. ‘ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడి నుంచి’ విముక్తి కావాలి. ఇదే మేం కోరుకునే ఆజాదీ’’ అని మీడియా ప్రశ్నకు బదులుగా పేర్కొన్నారు. ఈ పోరాటంలో విజయం తథ్యమన్నారు. తాము శాంతి కాముకులమని, హింసను కోరుకోమని స్పష్టం చేశారు. హెచ్‌సీయూలో మంగళవారం పోలీసుల లాఠీచార్జిని తీవ్రంగా ఖండించారు. అనంతరం కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర్ రావు (సీఆర్) ఫౌండేషన్‌లో రోహిత్ వేముల తల్లి రాధికను కన్హయ్య పరామర్శించారు. సాయంత్రం 5.30కు ఆమెను కలసి దాదాపు పది నిమిషాలు మాట్లాడారు.
పోటాపోటీ నినాదాలు
అంతకుముందు ప్రసంగం అనంతరం విద్యార్థులతో కలిసి కన్హయ్య చేసిన నినాదాలతో హెచ్‌సీయూ ప్రధాన గేటు ప్రాంతమంతా మార్మోగింది. ‘జై భీం’, ‘రోహిత్ వేములకు న్యాయం కావాలి’, ‘రోహిత్ చట్టం తేవాలి’, ‘సామాజిక న్యాయం జిందాబాద్’, ‘కులవాదం ముర్దాబాద్’, ‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వర్థిల్లాలి’, ‘ఇంకెందరు రోహిత్‌లను చంపుతారు?’ ‘ఇంటింటి నుంచీ ఓ రోహిత్ వస్తాడు’ అంటూ హోరెత్తించారు. కన్హయ్య హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ‘దేశ్‌ద్రోహి కన్హయ్య గో బ్యాక్’ అంటూ ఓ ఏబీవీపీ విద్యార్థి నినదించాడు. ‘కన్హయ్య జిందాబాద్’ అంటూ మరో వర్గం విద్యార్థులు హోరెత్తించారు. ఏబీవీపీ విద్యార్థిని పోలీసులు పక్కకు లాక్కెళ్లారు.
నారాయణ, చాడ స్వాగతం
కన్హయ్యకు బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. వర్సిటీల్లో సామాజిక న్యాయం కోసం పోరాడతానని ఈ సందర్భంగా ఆయనన్నారు. కన్హయ్యను చూసి కేంద్రం భయపడుతోందని నారాయణ ఎద్దేవా చేశారు. కన్హయ్యరాక సందర్భంగా విమానాశ్రయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కన్హయ్యను మేం అడ్డుకోలేదు: పోలీసులు
అనుమతి ఉన్నా ఆయనే లోనికి వెళ్లలేదని వివరణ
హెచ్‌సీయూలోకి వెళ్లకుండా కన్హయ్యను తాము అడ్డుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన లోనికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించలేదన్నారు. ‘‘రెండు వాహనాలను లోపలికి అనుమతించాలని సిబ్బందికి సైబరాబాద్ ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ రాంచంద్రారెడ్డి సూచించారు. కానీ పోలీసులను సంప్రదించకుండానే కన్హయ్య వెనుదిరిగారు. అనుమతి ఉన్నా లోపలికి వెళ్తానని అడగలేదు’’ అని పోలీసులు తెలిపారు. హెచ్‌సీయూలోని రోహిత్ స్తూపం వద్దకు వెళ్లేందుకు కన్హయ్యతో పాటు మరో పది మంది బృందాన్ని మాత్రమే అనుమతి ఇస్తామని వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది చెప్పగా, కాన్వాయ్‌తో పాటు అందరినీ అనుమతించాలని వారు కోరారు. వీసీ ఆదేశాల మేరకు సిబ్బంది అందుకు అంగీకరించలేదు.
నేడు కన్హయ్య సభ నిర్వహించి తీరతాం: నారాయణ
వామపక్ష భావజాలమున్న విద్యార్థులను కేంద్రం అణగదొక్కుతోందని సీపీఐ నేత కె.నారాయణ ధ్వజమెత్తారు. వర్సిటీలను పోలీసు క్యాంప్‌లుగా మార్చుతున్న కేంద్రానికి గుణపాఠం చెబుతామన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం కన్హయ్య కుమార్ సమావేశానికి పోలీసులు అనుమతివ్వకపోతే పార్కులోనైనా నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. హాల్ మీటింగ్ రద్దు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.