అన్నా... నేను కేసీఆర్‌ను..!
హైదరాబాద్: ‘అన్నా.. విద్యన్నా.. నేను కేసీఆర్‌ను అన్నా..!’ అంటూ తెలంగాణా రాస్ర్ట ప్రభుత్వ సాగునీటిరంగ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావును పరామర్శిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్న మాటలు ఇవీ. ఇదే సమయంలో విద్యాసాగర్‌రావు సతీమణి కూడా...‘ ఏమండీ....సారొచ్చిండు...కేసీఆర్ సారొచ్చిండు....ఒక్కసారి చూడుండి’ అంటూ పిలవగా ఒకసారి కదిలినట్లు అనిపించారు.
దీంతో మళ్ళీ కేసీఆర్ ‘అన్నా... విద్యన్నా.. అన్నా.’ అంటూ ఆప్యాయంగా మరోసారి పిలవగా శరీరంలో కదలిక ఏర్పడడంతో వైద్య చికిత్సకు స్పందించడం, కాళ్ళు, చేతులు కదిలించడం పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విద్యాసాగర్‌రావు సతీమణి, ఇతర, బంధువులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. విద్యాసాగర్‌రావు త్వరగా కోలుకుంటారని ఆశాబావాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కాంటినెంటల్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గురు ఎన్ రెడ్డి, ఇతర ఉన్నత వైద్యాధికారులతో మాట్లాడారు. ఆయనకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలను అందిస్తున్నామని ఆస్పత్రి ఉన్నతాధికారులు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ఆయన కోలుకొని మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చేలా తగిన వైద్య సేవలను అందించాలని వైద్యులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా తనతో పాటు ఆస్పత్రికి వచ్చిన పార్లమెంట్ సభ్యులు వినోద్‌కుమార్, గుత్తాసుఖేందర్‌రెడ్డిలు విద్యాసాగర్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు.