‘ఉద్యోగులు, పెన్షనర్ల వేతన బకాయిలను చెల్లించాలి’
సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ
కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత ఆరోగ్య సౌకర్యాన్ని కల్పించాలని వినతి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పదో వేతన సవరణకు సంబంధించి.. ఉద్యోగులు, పెన్షనర్ల వేతన బకాయిలు (2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 వరకు) వెంటనే నగదురూపంలో చెల్లించాలని సీఎం కేసీఆర్‌ను బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన ఒక లేఖ రాశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత ఆరోగ్య సౌకర్యాన్ని కల్పించాలని, కరువుభత్యం వాయిదాను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.
వారికి వేతన సవరణ బకాయిలను నగదు రూపంలో చెల్లించడం లేదా పీఎఫ్ ఖాతాలో (రెగ్యులర్ ఉద్యోగులకు) జమచేయడం ఆనవాయితీగా వస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. గతంలో డా. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నపుడు ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చి అమలుచేశారని ఆయన గుర్తు చేశారు. కనీసం కరువుభత్యం వాయిదాలు కూడా సకాలంలో చెల్లించకపోవడం, 2015 జులై 1 నుంచి రావాల్సిన కరువుభత్యవాయిదాపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. పదోవేతన కమిటీ సిఫార్సుల అమల్లో రోశయ్య ప్రభుత్వం ఇచ్చిన 39 శాతం ఫిట్‌మెంట్‌ను 4 శాతం పెంచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులకు ఇవ్వడం గొప్ప విషయమేమీ కాదన్నారు.