‘కృష్ణా’పై మళ్లీ ట్రిబ్యునల్‌కు | 'Krishna' On Again Tribunal | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’పై మళ్లీ ట్రిబ్యునల్‌కు

Published Fri, Jul 8 2016 3:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

‘కృష్ణా’పై మళ్లీ ట్రిబ్యునల్‌కు

‘కృష్ణా’పై మళ్లీ ట్రిబ్యునల్‌కు

రేపు, ఎల్లుండి వాదనలు వినిపించనున్న రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించనుంది. శని, ఆదివారాల్లో (9, 10 తేదీలు) రాష్ట్రం వాదనలు వినిపించనుండగా 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. కృష్ణా పరీవాహకాన్ని వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు తిరిగి పునఃకేటాయింపులు జరపాలని, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రిబ్యునల్‌కు రాష్ట్రం కోరనుంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు తమకు ఉన్న నికర జలాల కేటాయింపుల మేరకే అయినా..

వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్లుగా ఎగువనే వాడుకోవడంతో దిగువ కు చుక్క నీరు చేరడం లేదని, దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులన్నీ డెడ్‌స్టోరేజీకి చేరి మట్టిదిబ్బలుగా మారుతున్నాయన్న అంశాలను ప్రభుత్వం వివరించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో కర్ణాటక, మహారాష్ర్టల్రు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. అయితే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి వాటిలో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది.

నికర జలాలే వినియోగించుకుంటేనే ఖరీఫ్ తొలి రెండు నెలల్లో చుక్కనీరు కిందకు రాని పరిస్థితి ఉంటే, మిగులు జలాలను నిల్వ చేసుకుంటే పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని ట్రిబ్యునల్ దృష్టికి రాష్ట్రం తీసుకెళ్లనుంది. నీటి లభ్యతను అంచనా వేయడానికి తీసుకున్న 65 శాతం డిపెండబులిటీ పద్ధతి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు అనుమతి వంటి కారణాలతో రాష్ట్రం 130 టీఎంసీల వరకు నీటిని కోల్పోతుందని వివరించనుంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం, ఆంధ్రా, రాయలసీమలు కలుపుకొని 31.5 శాతం మాత్రమే ఉన్నా కేటాయింపులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ జరిపారని, వాటిని సవరించాలని కోరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement