
12న సూర్యోదయం నుంచి కృష్ణా పుష్కరాలు
- ముహూర్తం నిర్ణయించిన దేవాదాయ శాఖ
- అన్ని ప్రభుత్వ విభాగాలకు సర్క్యులర్ జారీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఎక్కువ మంది పండితులు వెలిబుచ్చిన అభిప్రాయం మేరకు ఈ ముహూర్తాన్ని నిశ్చయించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్ అన్ని విభాగాలకు సర్క్యులర్ జారీ చేశారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో నిమగ్నమైన అన్ని విభాగాలను అప్రమత్తం చేశారు.
ఇటీవల కృష్ణా పుష్కరాలకు ఆర్థిక శాఖ విడుదల చేసిన రూ.3 కోట్ల బడ్జెట్‌ను నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు కేటాయిస్తూ దేవాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండకు రూ.1.50 కోట్లు, మహబూబ్‌నగర్ రూ.1.50 కోట్లు కేటాయించింది. ట్రెజరీ ఆంక్షలను సడలిస్తూ.. ఈ నిధులను ఖర్చు చేసే బాధ్యతలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.