
న్యాయవాది ప్రకాశ్‌గౌడ్ హఠాన్మరణం
హైదరాబాద్: ప్రముఖ న్యాయవాది, బీజేపీ లీగల్ సెల్ గ్రేటర్ నాయకుడు కె.ప్రకాశ్‌గౌడ్(73) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ మల్లేపల్లిలోని తన స్వగృహంలో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయన 40 సంవత్సరాలకుపైగా బీజేపీలో ఉంటూ పేదలకు ఉచితంగా సేవలందించారు. గతంలో నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్యను విడుదల చేయించి న్యాయవాద వృత్తిలో పేరుగాంచారు.
మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కె. రాములు, భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం ప్రకాశ్‌గౌడ్ అంత్యక్రియలు విజయ్‌నగర్‌కాలనీ శ్మశానవాటికలో జరిగాయి.