
ఆకుపచ్చని గణేశుడు.. ఆండ్రాయిడ్‌లో ఒదిగాడు..
నగర వాసులకు పర్యావరణ స్పృహ అధికం. ప్రకృతిని కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
నాచారం: నగర వాసులకు పర్యావరణ స్పృహ అధికం. ప్రకృతిని కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలను, ఎకో ఫ్రెండ్లీ ప్రతిమలను ప్రతిష్టించాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ విధానాన్ని గత కొన్నేళ్లుగా పాటిస్తున్నవారూ ఉన్నారు. నాచారం బాబానగర్‌కు చెందిన సూర్య శుభకర విఘ్న వినాయక అసోషియేషన్ ఆర్గనైజర్ సూర్యప్రకాష్ ఆరేళ్లుగా వినూత్న రీతిలో పర్యావరణ గణేష్ విగ్రహాలను రూపొందిస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ ఏడాది వినాయక చవితికి 30 వేల దారం రీళ్లను వినియోగించి 12 అడుగుల ‘త్రెడ్ ఆండ్రాయిడ్ గణేష్’ను తయారు చేశారు. ఇందు కోసం ఆకుపచ్చని దారాన్ని వాడారు.
ఈ విగ్రహాన్ని బాబానగర్‌లో ప్రతిష్టించనున్నట్టు వివరించారు. అంతేకాదు.. పర్యావరణ ప్రేమికులు ఎవరన్నా కోరితే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు తయారు చేసి ఇస్తున్నారు. ఇందుకు కేవలం తయారీ ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు లక్ష కుందన్స్‌తో ‘కుందన్ గణేష్’, 70 వేల శివలింగాలతో లింగ గణేష్, పేపర్ టీకప్స్ గణేష్‌ను కూడా తయారు చేశారు. ఈ పర్యావరణ సహిత విగ్రహాల తయారీలో తనకు మనోజ్, శేఖర్, బాలకృష్ణ, నర్సింగ్, సంజిత్, రాజు, పట్టి తదితర 15 మంది విద్యార్థులు సాయం అందిస్తున్నట్టు తెలిపారు.